జమ్మూకశ్మీర్ రాజకీయ వేదికపై మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. ‘జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ’ (జేకేఏపీ)ని పీడీపీ మాజీ నేత, గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన సైయద్ అల్టాఫ్ బుఖారి ఆదివారంనాడు శ్రీనగర్‌లో లాంఛనంగా ప్రారంభించారు. పీడీపీ, ఎన్‌సీ, కాంగ్రెస్‌కు చెందిన 40 మంది మాజీ ఎమ్మెల్యేలు ఈ పార్టీలో చేరారు.
జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆరు నెలల తర్వాత జమ్మూకశ్మీర్‌లో కొత్త రాజకీయ శక్తి అవతరించడం ఇదే మొదటిసారి.కాశ్మీర్‌లోయలో కమ్యూనికేషన్ల దిగ్బంధం, ప్రధాన నేతల నిర్బంధంతో పాటు, రాష్ట్ర ప్రత్యేక హోదాను రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించిన సమయంలో ఈ పార్టీ అరంగేట్రానికి సిద్ధమవటం గమనార్హం.
బీజేపీ ఆశీస్సులతోనే కొత్త పార్టీ తెరపైకి వస్తోందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాశ్మీర్ లోయ రాజకీయాలపై ప్రాబల్యం గల ఉబర్ అబ్దుల్లా, ముఫ్తి మెహమూద్ లను గత ఆగష్టు నుండి గృహ నిర్బంధంలో ఉంచడం గమనార్హం. వారిద్దరి పరటీలను చీల్చి, కొత్తగా ఏర్పడిన ఈ పార్టీ కేవలం బిజేపికి కాశ్మీర్ లోయలో రాజకీయ మద్దతు కూడదీయడం కోసమే అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
ఈ ఊహాగానాలను బిజెపి తిప్పి కొడుతున్నా ఇమ్రాన్ నబీ స్పందిస్తూ కాశ్మీర్‌లో ఊహాగానాలు, అంచనాలు అన్ని వేళలా నిజమయ్యాయన్న విషయం గతానుభవాల ద్వారా తెలుస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం, ప్రతిష్టను కాపాడేందుకు, కశ్మీర్ పండిట్లు తిరిగి రావడానికి కట్టుబడి ఉంటామని, మహిళలు, యువకుల సాధికారతకు పెద్దపీట వేస్తామని బుఖారి చెప్పారు.
పూర్తి ఆశావహ దృక్పథం, నిజాయితీ, నిష్పాక్షికతతో పార్టీ ఏర్పాటు చేశామని, ఈ రాజకీయ ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములేనని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ ఎన్నో త్యాగాలు చేసిందని, ప్రజల కలలు సాకారం చేసేందుకు పార్టీ కృషిచేస్తుందని బుఖారి చెప్పారు.