Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం జోరందుకుంది. ఈ 14 రోజులు ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు అస్త్ర శస్త్రాలతో బయల్దేరుతున్నాయి. అభ్యర్థులు సైతం తమ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రస్తుత వాతావరణం చూస్తుంటే బీఆర్‌ఎస్–కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగుతుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ప్రజల్లో మౌత్ టాక్ కూడా అదేవిధంగా ఉంది. అయితే కొన్నిచోట్ల ముక్కోణపు పోటీ తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో బీజేపీ సోషల్ ఇంజినీరింగ్ మొదలు పెట్టింది. రెండు సభలతో ఎన్నికల్లో ప్రజల దృష్టిని ఒక్కసారిగా తమవైపు తిప్పుకుంది.
మొన్నటి వరకు ఢీ అంటే ఢీ అన్నట్లు..
తెలంగాణలో ఏడాది క్రితం వరకు బీజేపీ బీఆర్‌ఎస్ మధ్యనే పోరు అన్న పరిస్థితి నెలకొంది. రెండు ఉప ఎన్నికల్లో విజయం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించడం బీజేపీకి మరింత ఊపు తెచ్చాయి. బండి సంజయ్ ప్రజాసంగ్రా యాత్రలు పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాయి. ఇక బీఆర్‌ఎస్‌ను ఓడించే సత్తా బీజేపీకే ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాలు, బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్‌ను తప్పించడం తదితర పరిణామాలతో పార్టీ ఒక్కసారిగా చల్లబడింది. క్యాడర్ కూడా మౌనంగా ఉంటోంది.
సోషల్ ఇంజినీరింగ్‌తో..
తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పోరు సాగుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ తనదైన సోషల్ ఇంజినీరింగ్‌కు తెరలేపింది. బీసీలు, మాదిగ సామాజిక వర్గాలను కేవలం రెండు సభలతో తనవైపు తిప్పుకుంది. ప్రధాని మోదీ మూడు రోజుల వ్యవధిలో నిర్వహించిన రెండు సభలతో ఒక్కసారిగా అందరి దృష్టి బీజేపీవైపు మళ్లింది.
యూపీ తరహాలో..
2017లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సోషల్ ఇంజినీరింగ్ అస్త్రంతో అధికారంలోకి వచ్చింది. దాదాపు 14 ఏళ్లు యూపీలో బీజేపీ అధికారినికి దూరంగా ఉంది. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఒక్కసారిగా యూపీపై దృష్టిపెట్టింది కమలం పార్టీ. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 70 మంది బీజేపీ అభ్యర్థులను అక్కడి ప్రజలు గెలిపించారు. దీంతో బీజేపీ 2017లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా సోషల్ ఇంజినీరింగ్ మొదలు పెట్టింది. ముస్లింలకు టికెట్ ఇవ్వకుండా బీసీలు, దళితులను తమవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. ఇదే అస్త్రం బీజేపీని 2017, 2022లో యూపీలో అధికారంలోకి తీసుకువచ్చింది. ఉచిత రేషన్ అంశం కూడా దీనికి తోడైంది.
తెలంగాణలో అదే అస్త్రం..
ఇప్పుడు తెలంగాణలోనూ బీజేపీ అదే అస్త్రం ప్రయోగిస్తోంది. అదే తరహా సోషల్ ఇంజినీరింగ్ మొదలు పెట్టింది. తెలంగాణలో అధికశాతం ఓటర్లు ఉన్న బీసీలకు రాజ్యాధికారం అవకాశం ఇస్తామని ప్రకటించింది. తరతరాలుగా రాజ్యాధికారానికి దూరం అవుతున్న బీసీలకు బీజేపీని గెలిపిస్తే ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది. ఇది మంచి అవకాశంగా బీసీలు భావిస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ ఇదే తరహా అవకాశం కల్పించింది. ఉమ్మడి రాష్ట్రంలో బీసీలకు 100 టికెట్లు ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అలాంటి అవకాశమే ఇచ్చింది. బీజేపీ 36 సీట్లు, పొత్తులో బీజేపీతో జట్టు కట్టిన జనసేన 4 బీజేపీలకు ఇచ్చింది. ఇప్పుడు కాకపోతే.. ఎప్పుడూ కాదు అన్న తరహాలో బీజేపీ బీసీలను హైలెట్ చేస్తోంది. ఈ అవకాశాన్ని వదులుకుంటే ఎన్నటికీ బీసీలకు రాజ్యాధికారం రాదన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. అగ్రవర్ణ ఆధిపత్య రాజకీయాల్లో బీజేపీ ఆఫర్ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
ఎస్సీ వర్గీకరణ అంశంతో..
తాజాగా మరుగున పడిన ఎస్సీ వర్గీకరణ అంశాన్ని బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ప్రారంభించింది. ఎల్‌బీనగర్‌లో ఎమ్మార్పీఎస్ నిర్వహించిన మాదిగల విశ్వరూప సభకు మోదీని ఆహ్వానించింది. సభకు వచ్చిన మోదీ.. సోషల ఇంజినీరింగ్‌లో భాగంగా ఎస్సీ వర్గీకరణకు తనది హామీ అన్నట్లుగా వ్యవహరించారు. ఇలా మాదిగలను తమవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు.
అద్భుతమైన సోషల్ ఇంజినీరింగ్..
అద్భుతమైన సోషల్ ఇంజినీరింగ్ ప్రారంభించిన బీజేపీ.. అగ్రవర్ణ పార్టీలుగా ముద్రపడిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఎలా చిత్తు చేస్తుంది… అద్భుతైమన సోషల్ ఇంజినీరింగ్‌తో యూపీ తరహాలో తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తుందా.. బీసీలు బీజేపీ ఆఫర్‌ను వదులుకుంటారా వినియోగించుకుంటారా అన్నది డిసెంబర్ 3న తేలిపోతుంది.