తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ దూసుకెళ్తోంది. కొత్త కొత్త విషయాలను వెలుగులోకి తెస్తూ తమ ప్రచారాన్ని ముమ్మరంగా నడిపిస్తున్నారు. తాజాగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. విమర్శలు కాదు.. ఏకంగా ఆయన బయోగ్రఫినే బయటపెట్టేశారు. ఈ ఆరోపణలతో ఒక్కసారిగా వైసీపీ నేతలందరూ ఆలోచన పడిపోయారు. ఈ ఆరోపణల నుంచి ఇప్పుడు ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నారు.
వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఒక్కసారి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోలేదని సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. అంతేకాదు.. ఆయన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుపోగా.. చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేసినట్లు వెల్లడించారు. నామినేషన్ వేసే ముందు కూడా చర్చిలో ప్రార్థనలు చేశారని.. ఈ మేరకు ఫొటోలు కూడా బయటపెట్టేశారు.
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజే ఈ ఆరోపణలన్నింటినీ వెలుగులోకి తెచ్చారు. గురుమూర్తి మీద మొదటి నుంచి ఆయన ప్రత్యేక ఫోకస్ పెట్టారు. సందర్భం దొరికినప్పుడల్లా గురుమూర్తిపై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఇక తాజాగా.. ఆయన తిరుమల దేవస్థానాన్ని దర్శించుకోలేదనే సంచలనం విషయాన్ని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. గురుమూర్తి క్రిస్టియన్ అని.. ఎస్సీ రిజర్వేషన్ కేటగిరి నుంచి పోటీ చేసేందుకు అనర్హుడంటూ ఆరోపించారు. మతం మార్చుకున్న వారికి రిజర్వేషన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు.
అయితే.. గురుమూర్తి మతం మార్చుకున్నాడని నిరూపించడం బీజేపీ పెద్ద విషయమేమీ కాదు. కానీ.. ఇప్పుడు అలా నిరూపించడం కంటే ఆయన క్రిస్టియన్ అని ప్రచారం చేసి ఎన్నికలో లబ్ధిపొందాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. టెంపుల్ సిటీ అయిన తిరుపతి కేంద్రంగా ఓ క్రిస్టియన్ లోక్‌సభకు వెళ్తే తిరుపతికి ఏమాత్రం సెక్యూరిటీ కాదని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.