మాజీ మంత్రి ఈటల రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి పోరు రసవత్తరంగా మారనుంది. అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ లు ఎవరికి వారే అన్నట్లుగా ఇక్కడ పోటీకి సిద్ధమవుతున్నాయి. అయితే టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ గెలుపుకోసం రాష్ట్ర బీజేపీ నాయకత్వం పాదయాత్రను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పెద్దల అనుమతి తీసుకోవడానికి బుధవారం ఢిల్లీ వెళ్లింది. అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలవడంతో ఆయన సానుకూలంగా స్పందించారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా ఈటల రాజేందర్ గెలుస్తూ వస్తున్నారు. అయితే రాష్ట్రమంత్రిగా ఉన్న అతన్ని బర్త్రఫ్ చేయడంతో బీజేపీలో చేరారు. అంతకుముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మరోసారి ఎలాగైనా గెలిచేందుకు బీజేపీ సపోర్టు తీసుకున్నారు. ఇదే సమయంలో బీజేపీ కూడా ఇక్కడ జెండా ఎగురవేయడానికి కసరత్తులు చేస్తోంది. గతంలో దుబ్బాక ఎన్నికలో గెలిచిన మాదిరిగానే హూజుారాబాద్ లో కూడా ఈటలను గెలిపించేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు.
ఇందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి ఈటల రాజేందర్, ఇతర నాయకులు ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుంచి అమిత్ షాను కలువలేదు. దీంతో బుధవారం ఆయనతో ప్రత్యక్ష మీటింగ్లో కలుసుకోవడం సంతోషకరమని చెప్పాడు. ఇక అమిత్ షాకు ఈటల గెలుపు కోసం పాదయాత్ర కార్యక్రమాన్ని బండి సంజయ్ వివరించారు. దీంతో అమిత్ షా అందుకు అనుమతినిచ్చారు. అంతేకాకుండా తెలంగాణకు బీజేపీ గెలుపుకోసం ఎన్నిసార్లయినా వస్తానని అన్నారు. అంటే హుజూరాబాద్ ప్రచారానికి కూడా అమిత్ షా వచ్చే అవకాశం ఉందని బీజేపీ నాయకులు తెలిపారు. ఇక టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఎలాగూ డబ్బులు పంచుతుందని, అయితే డబ్బులు తీసుకుని బీజేపీకి ఓటెయ్యాలని సంజయ్ కోరారు.
గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అమిత్ షా పర్యటించారు. దీంతో అంతకుముందు వరకు 4 సీట్లున్న బీజేపీ ఏకంగా 48 సీట్లకు పెరిగింది. ఇప్పుడు హుజూరాబాద్లో కూడా అమిత్ షా పర్యటిస్తే హుజూరాబాద్లో గెలుపు ఖాయమనే ఊపులో బీజేపీ నాయకులున్నారు. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న తరువాత సంజయ్ కాస్త వెనుకబడ్డట్లు ప్రచారం జరిగింది. ఇది గ్రహించిన సంజయ్ వెంటనే అమిత్ షాను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.