మరో ఒకట్రెండు నెలల్లో తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. వీటిలో ప్రధానంగా బీజేపీ అసోంపైనే ఫోకస్ పెట్టినట్లుగా అర్థం అవుతోంది. అధికారంలో ఉన్న ఈ ఈశాన్య రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు సిద్ధపడింది. ఈశాన్యానంలో అసోం అతిపెద్ద రాష్ట్రం. దక్షిణ రాష్ట్రాలైన తమిళనాడు, కేరళల్లో పార్టీకి విజయావకాశాలు తక్కువే. ఇక బెంగాల్‌లో పార్టీ బలంగా ఉన్నా.. మమతను గద్దె దించేంత బలం కాషాయ పార్టీకి లేదన్నది నిజం.
Also Read : ఆల్‌టైమ్ గ్రేట్ భూటాన్.. కరోనా కేసులు 866 మాత్రమే..
ఇక.. పుదుచ్చేరి చాలా చిన్నది. అది కేంద్ర పాలిత ప్రాంతం. ఇక్కడ పార్టీ బలం నామమాత్రం. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఒక్క అసోంలోనే బీజేపీ బలంగా ఉంది. అందులోనూ అధికారంలో కూడా ఉంది. అందువల్ల ఇక్కడ మళ్లీ గెలవాలన్న లక్ష్యంతో పార్టీ ముందుకు సాగుతోంది. ఈ ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్రమోడీ 20 రోజుల్లో రెండుసార్లు అసోంలో పర్యటించారు. జనవరి 16న శివసాగర్ జిల్లాలో పర్యటించి గిరిజన రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. తాజాగా ఫిబ్రవరి 7న రెండోసారి రాష్ట్రాన్ని సందర్శించారు. తేయాకు తోటలకు పేరుగాంచిన ధెకియాజులి ప్రాంతంలో పర్యటించారు. ఫిబ్రవరి 6న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అసోం రాజధాని గౌహతీ నగరాన్ని సందర్శించారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనలకు వచ్చినట్లు చెబుతున్నప్పటికీ అసలు ఉద్దేశం ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడమేనని అందరికీ తెలిసిన విషయమే.
గత ఎన్నికల్లో తొలిసారి అసోంలో కాషాయ పార్టీ జయకేతనం ఎగురవేసింది. అప్పట్లో అసోం గణ పరిషత్ (ఏజీపీ), బోడో పీపుల్స్ ఫ్రంట్ (బీ పీ ఎఫ్) తో పొత్తు పెట్టుకుని ఘన విజయం సాధించింది. బీజేపీ 61, ఏజీపీ 13, బీపీఎఫ్ 14 సీట్లు సాధించాయి. ముఖ్యమంత్రి సర్బానంద్ సోనావాల్ నాయకత్వంలోని ప్రభుత్వం ఐదేళ్లుగా అధికారంలో కొనసాగుతోంది. ముగ్గురు బోడో మంత్రులు కేబినెట్‌లో ఉన్నారు. బోడో ప్రాంతీయ మండలి ఎన్నికలపై బీజేపీ, బీపీఎఫ్ మధ్య ఇటీవల కాలంలో కాలంలో తేడాలు వచ్చాయి. దీంతో ఈసారి రెండుపార్టీలు విడివిడిగా పోటీ చేయనున్నాయి. ఏజీపీతో మాత్రం పొత్తు కొనసాగుతుంది. దీంతోపాటు కొత్తగా ఆవిర్భవించిన యునైటెడ్ పీపుల్స్ పార్టీతో కలసి పోటీ చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రంజిత్ కుమార్ దాస్ ప్రకటించారు.
Also Read : బీజేపీ అగ్రనేతల్లో ‘అగ్రి’ టెన్షన్
2001 నుంచి 2016 వరకు వరుసగా మూడు దఫాలు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో ఓటమిపాలై బీజేపీకి అధికారాన్ని అప్పగించింది. నాటి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 19 సీట్లకు పరిమితమైంది. ఈసారి అధికార సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్), అంచాలిక్ గణ మోర్చా, సుగంధ ద్రవ్యాల వ్యాపారి, పార్లమెంటు సభ్యుడు, అఖిల భారత యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయుడీఎఫ్) అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. అజ్మల్ పార్టీ గత ఎన్నికల్లో 14 సీట్లు సాధించింది. ఈ పార్టీకి ముస్లింలలో మంచి పట్టుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, అజ్మల్ పార్టీ విడివిడిగా పోటీ చేసి దెబ్బతిన్నాయి. దీంతో ఈసారి పొత్తు పెట్టుకున్నాయి. అందుకే.. ఈ సారి తమ కూటమి విజయం తథ్యమని పీసీసీ చీఫ్ రిపున్ బోరా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పార్టీల కలయిక కరెక్ట్ అయినది కాదని.. అప్రవిత్రమని.. ప్రజలు తిరస్కరిస్కరించడం ఖాయమని మరోపక్క బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. మొత్తంగా బీజేపీ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్