ఎంపీలో ‘కీలు బొమ్మ’ సీఎంకై మోదీ ఎత్తుగడ!

మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి మూడు రోజులైనా ఇంకా ప్రభుత్వం ఏర్పాటు గురించి బీజేపీలో సందడి కనిపించడం లేదు. 15 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహన్ కాబోయే ముఖ్యమంత్రి అని అందరు అనుకున్నారు. అయితే ఎప్పటికైనా ప్రధాన మంత్రి పదవికి పోటీరాగల వ్యక్తి బీజేపీలో ఆయనే కావచ్చనే ఉద్దేశ్యంతో మరో `కీలుబొమ్మ’ ముఖ్యమంత్రి కోసం ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా వ్యూహాత్మకంగా అడుగులు […]

Written By: Neelambaram, Updated On : March 23, 2020 7:14 pm
Follow us on

మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి మూడు రోజులైనా ఇంకా ప్రభుత్వం ఏర్పాటు గురించి బీజేపీలో సందడి కనిపించడం లేదు. 15 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహన్ కాబోయే ముఖ్యమంత్రి అని అందరు అనుకున్నారు. అయితే ఎప్పటికైనా ప్రధాన మంత్రి పదవికి పోటీరాగల వ్యక్తి బీజేపీలో ఆయనే కావచ్చనే ఉద్దేశ్యంతో మరో `కీలుబొమ్మ’ ముఖ్యమంత్రి కోసం ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది.

2013లో బీజేపీలో ఓబిసి అభ్యర్థిగా ప్రధానమంత్రి అభ్యర్థిత్వం కోసం మోదీ పోటీ పడుతున్న సమయంలో అదే వర్గానికి చెందిన చౌహన్ సహితం పోటీలో ఉండడం గమనార్హం. ఒక బహిరంగసభలో చౌహన్ మంచి ప్రధాన మంత్రి అభ్యర్థి కాగలరని స్వయంగా ఎల్ కె అద్వానీ ప్రకటించారు కూడా. చివరి వరకు అద్వానీ, సుష్మ స్వరాజ్ లకు అనుకూలంగా ఉంది మోదీ, అమిత్ షా సరసన చేరకుండా వస్తున్నారు.

బీజేపీలో వీరిద్దరి ఆధిపత్యాన్ని ఒక విధంగా సవాల్ చేస్తున్నది ముగ్గురే నాయకులు. మొదటగా చౌహన్ కాగా, మరొకరు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆమెను కేంద్ర మంత్రివర్గంలో రక్షణ మంత్రిగా చేసి అమిత్ షా స్వయంగా ఆహ్వానించారు. అయితే అందుకు ఆమె తిరస్కరించడమే కాకుండా “మోదీ ప్రధాని కాకముందే నా ఇమేజ్ తో సీఎం అయ్యాను. మరోసారి కాబోతున్నాను. మరొకరి కింద పనిచేయవలసి అవసరం నాకు లేదు” ఆమె స్పష్టం చేశారు.

ఇక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహితం తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. అందుకనే మహారాష్ట్రలో ఐదేళ్ల క్రితం ఎన్నికల అనంతరం గడ్కరీ పేరు సీఎంగా తెరపైకి వచ్చినా ఆయనతో సంబంధం లేకుండా ఆయన ప్రాంతానికే చెందిన, ఆయన సామజిక వర్గానికే చెందిన జూనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ను తెరపైకి తీసుకు వచ్చారు. తద్వారా గడ్కరీ ఆధిపత్యాన్ని తగ్గించే ప్రయాత్నం చేశారు.

2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ – బీజేపీల మధ్య సీట్ల తేడా ఐదు మాత్రమే. ఎన్నికల ఫలితాలు పూర్తిగా బైటకు రాకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని చౌహన్ ధీమా వ్యక్తం చేసినా, మోదీ అనూహ్యంగా బహిరంగంగా బిజెపి ఓటమిని అంగీకరించారు. ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నం చేయవద్దని చౌహన్ ను హెచ్చరించారు. దానితో మోదీ `ఆశీస్సులు’ తోనే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినదని గ్రహించాలి.

అయితే ఇప్పుడు వరుసగా ఒకొక్క రాష్ట్రాలలో బిజెపి బలం తగ్గుతూ ఉండడం, ఢిల్లీలో అల్లర్ల సమయంలో హోమ్ శాఖ నిర్వహిస్తున్న అమిత్ షా `అసమర్ధ’ పాలన వెల్లడి కావడంతో బిజెపి వర్గాలలో మోదీ, అమిత్ షా ల `సమర్ధత’లపై విశ్వాసం సన్నగిల్లడం ప్రారంభమైనది. అందుకనే వారందరి దృష్టి మళ్లించడం కోసం గుజరాత్ లోని బరోడాకు చెందిన జ్యోతిరాదిత్య సింధియా అత్తింటివారైన గైక్వాడ్ రాజకుటుంబం ద్వారా ప్రభుత్వ `ఫిరాయింపు’ డ్రామా ఆడించారు.

అందుకనే ఇప్పుడు చౌహన్ ను తిరిగి ముఖ్యమంత్రిగా చేయకుండా కేంద్ర కేంద్ర వ్యవసాయ మంత్రి, నరేంద్ర సింగ్ తోమర్‌ను తెరపైకి తెస్తున్నారు. ప్రధానికి అత్యంత సన్నిహితుడైన ఆయనకు పరిపాలన పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 2014 తర్వాత బిజెపి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్రతి రాష్ట్రంలో కూడా జనబలం లేని, కేంద్రానికి `కీలుబొమ్మ’గా వ్యవహరించే వారినే ముఖ్యమంత్రులుగా ఎంపిక చేస్తూ రావడం గమనార్హం.

ముఖ్యమంత్రిగా చౌహన్ అసాధారణ ప్రతిభ చూపారు. మోదీ గుజరాత్ నమూనాకు భిన్నమైన పాలనతో ప్రజలను ఆకట్టుకున్నారు. 15 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయనపట్ల ప్రజలలో వ్యతిరేకత లేదు. పైగా మోదీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైనట్లు విమర్శలు ఎదుర్కొంటు, 2 శాతం కూడా వృద్ధి రేట్ సాధించలేని వ్యవసాయ, గ్రామీణ రంగాలలో 10 శాతంకు పైగా రాష్ట్రంలో చౌహన్ వృద్ధి రేట్ సాధించారు.

తమ నాయకత్వం పట్ల బిజెపి వర్గాలు విరక్తి చెందితే చౌహన్ తెరపైకి వచ్చే ప్రమాదమున్నదనే భయంతోనే ఆయనకు ఇప్పుడు అధికార పగ్గాలు దక్కకుండా చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.