Tula Uma
Tula Uma: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు దాదాపు అన్ని పార్టీల్లోనూ ఊహించని ఘటనలు జరుగుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు రాత్రికి రాత్రి కండువా మార్చేస్తున్నారు. టికెట్ దక్కలేదని తెలిసింది ఆలస్యం మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలు అటు కాంగ్రెస్‌లో, ఇటు బీజేపీలో చిచ్చు రాజేశాయి. ఈ రెండు పార్టీల్లోనూ అసమ్మతి గళాలు వినిపిస్తున్నాయి.
వేములవాడలో ఉమకు షాక్..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ టికెట్ విషయంలో మొదటి నుంచీ ఆసక్తి నెలకొంది. ఇక్కడ టికెట్‌ను మాజీ కేంద్రమంత్రి, మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావుకు ప్రతిష్టాత్మకంగా మారింది. తన కుమారుడు వికాస్‌రావుకు టికెట్ ఇవ్వాలని ఆయన పట్టుపట్టారు. మరోవైపు అదే సీటు కోసం బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పట్టుపట్టారు. దీంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపై పడింది. సంఘ్ పరివార్‌కు, కొత్తగా పార్టీలో చేరి పట్టు సంపాదించుకున్న వారికి మధ్య పోటీగా మారింది. ప్రధాని మోదీ సూర్యాపేట పర్యటన రోజు పార్టీ తుల ఉమ పేరును అభ్యర్థిగా ప్రకటించింది. అయితే విద్యాసాగర్‌రావు వర్గీయులు జీర్ణించుకోలేక నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద జాగరణ చేశారు. సంఘ్ పరివార్ కూడా వికాస్ వైపు మొగ్గు చూపడంతో చివరి క్షణంలో బిఫాంను వికాస్‌కు అందించారు. అయితే ఇదే రోజు నామినేషన్ వేసేందుకు ప్రదర్శనతో వచ్చిన తుల ఉమ అధిష్టానం నిర్ణయంతో షాక్ అయ్యారు.
ఆది శ్రీనివాస్‌తో భేటీ..
ఆఖరు నిమిషంలో బీఫాం తనకు ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న తుల ఉమ ఇంటికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ వెళ్లారు. కాంగ్రెస్‌లోకి రావాలని ఆమెను ఆహ్వానించారు. అటు బీఆర్ఎస్ నేతలు కూడా తుల ఉమను బీఆర్ఎలోకి తీసుకొచ్చే పనిలో పడ్డారు. తుల ఉమతో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మంతనాలు జరిపారు. తుల ఉమను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. రెండు పార్టీల నుంచి ఆహ్వానాలు అయితే అందాయి. మరి తుల ఉమ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కాంగ్రెస్ లో చేరతారా? గులాబీ గూటికి చేరతారా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది.
ఉమ్మడి జిలా‍్ల జెడ్పీ చైర్‌పర్సన్‌గా..
తుల ఉమ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు జెడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. రెండేళ్ల క్రితం ఈటల రాజేందర్‌తో కలిసి బీజేపీలో చేరారు. ఈటల గులాబీ గూటి నుంచి బయటకు వచ్చిన సమయంలో ఆయనకు అండగా నిలిచారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల విజయం కోసం ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించేందుకు ఈటల ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించి వేములవాడ టిక్కెట్ ఇప్పించుకోగలిగారు. కానీ చివరి నిమిషంలో ఈటలకు అధిష్టానం షాకిచ్చింది.
‘బండి’ మద్దతులో వికాస్‌కు బీఫాం..
వేములవాడ టికెట్‌ను బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు వికాస్‌రావు ఆశించారు. ఆయనకు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మద్దతుగా నిలిచారు. తొలుత టిక్కెట్ తుల ఉమకు ఇవ్వడంతో వికాస్‌రావు వర్గం ఆందోళన వ్యక్తం చేసింది. కార్యకర్తల మద్దతు ఎక్కువగా వికాస్ రావుకే ఉండటంతో బీజేపీ అధిష్టానం చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చింద.