Telangana Elections 2023: తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు రకరకాల హామీలు గుప్పిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన పథకాలను మరింత అభివృద్ధి చేసి ఇస్తామని చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పథకాలతో ప్రజల్లోకి వెళ్తుంది. అయితే బీజేపీ ఎలాంటి పథకాలు ప్రకటించకపోయినా ఊహించని విధంగా బీసీ నినాదాన్ని ఎత్తుకుంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీతో ప్రజలు కొంతమేర ఆ పార్టీ వైపు అనుకూలంగా మారారని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రజలను మరింత ఆకట్టుకునే విధంగా ఢిల్లీ పెద్దలు కొత్త ప్రయోగం చేపట్టనున్నారు. దీంతో తమ పార్టీని ఆదరించడం ఖాయమని అంటున్నారు. ఈమేరకు త్వరలోనే ఓ సంచలన ప్రకటన వెలువరించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
తెలంగాణలో మొన్నటి వరకు అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ అన్నట్లుగా గట్టి పోటీ ఇచ్చింది. దుబ్బాక తో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు, హుజురాబాద్ ఉప ఎన్నిక తో బీజేపీ ఫామ్ లోకి వచ్చినట్లయింది. అయితే ఆ తర్వాత ఆ పార్టీలో కొన్ని మార్పులు చోటు చేసుకున్న తర్వాత మూడో స్థానానికి పడిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉండాలని లక్ష్యంతో పాటు అధికారంలో రావడానికి ఆ పార్టీ సరికొత్త నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై ఎప్పటి నుంచో డిమాండ్ కొనసాగుతోంది. ఎస్సీలోని కొన్ని కులాలకు అన్యాయం జరుగుతందని, వర్గీకరణతోనే అందరికీ న్యాయం అవుతుందని కొందరు పోరాటాలు చేస్తున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ఆమోదం పొందిన తరువాత కేంద్రానికి పంపించింది. ఆ తరువాత ఎస్సీ వర్గీకరణ కోసం కొన్ని రాష్ట్రాలకు 2017లో సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఆ సమయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో పాటు కేంద్రాన్ని కలిసి ప్రత్యేకంగా కోరారు. ఎస్సీల వర్గీకరణతో పాటు కుల గణన చేపట్టాలని 2021 అక్టోబర్ 5న అసెంబ్లీలో డిమాండ్ చేశారు.
అయితే ఇంతకాలం ఈ విషయంపై కేంద్ర ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ తెలంగాణలో ఎన్నికల వేళ ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయం తీసుకోబోతుంది. తమ ప్రభుత్వం ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుందని ఇటీవల ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో మోదీ ప్రస్తావించారు. ఇందులో భాగంగా ఎస్సీ వర్గీకరణ చేపడితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనే విషయంపై తీవ్రంగా చర్చిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ వర్గీకరణ కోసం న్యాయ నిపుణులను కూడా కలుస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కేంద్రం ఎస్సీ వర్గీకరణపై సంచలన నిర్ణయం తీసుకుంటే తెలంగాణలో బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుందా? లేదా? చూడాలి.