దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తర ప్రదేశ్ లో.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది బీజేపీ. అయితే.. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న యోగి ఆదిత్యనాథ్ పనితీరుపై క్రమంగా ప్రజల్లో భ్రమలు తొలగిపోతున్నట్టు స్పష్టమవుతోంది. ‘ఉన్నావ్’ వంటి పలు అత్యాచార ఘటనలతో దేశవ్యాప్తంగా అభాసుపాలైంది బీజేపీ సర్కారు. ఇప్పుడు కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విమర్శలు నలువైపులా దాడిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు కాషాయ పార్టీకి దూరమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇటీవల యూపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పాతాళానికి పడిపోవడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు. ఏప్రిల్ నెలలో అక్కడ జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విపక్షాలు స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించాయి. మెజారిటీ పంచాయతీలను సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు గెలుచుకున్నాయి. దీంతో.. బీజేపీకి భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.
యూపీలో మొత్తం 3,050 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. విపక్షాలు ఏకంగా 2,400 సీట్లను గెలుచుకొని సత్తా చాటాయి. బీజేపీ కేవలం 700 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చివరకు ప్రధాని మోడీ ప్రాతానిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో కూడా బీజేపీ సత్తా చాటలేకపోయింది. అక్కడ మొత్తం 40 స్థానాలు ఉండగా.. కేవలం 8 చోట్ల మాత్రమే బీజేపీ గెలవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక, ముఖ్యమంత్రి యోగి సొంత ప్రాంతం గోరఖ్ పూర్ లోనూ విపక్షాలే విజయం సాధించాయి.
ఉత్తర ప్రదేశ్ లో విపక్షాలు తిరులేని ఆధిక్యం ప్రదర్శించాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే యూపీలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రభావం తప్పకుండా అసెంబ్లీ ఎన్నికల్లో కనిపిస్తుందటని అంటున్నారు. అయితే.. బీజేపీ నేతలు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు.. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేదని అంటున్నారు. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.