
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్నట్లుగా ఉంది టీడీపీ పరిస్థితి. చంద్రబాబు బీజేపీతో పొత్తుకు సై అంటున్నా కేంద్రం మాత్రం సిద్ధంగా లేదని తేల్చేశారు. దీంతో బాబు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. ఇన్నాళ్లు బీజేపీ, జనసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీడీపీ ప్రస్తుతం ఏం చర్యలు తీసుకుంటోందనని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. తమ విజయం కోసం ఏ మార్గాలు అన్వేషిస్తారో అని వేచి చూస్తున్నారు.
బీజేపీకి అంశాల వారీగా మద్దతిస్తామని టీడీపీ మహానాడులో తీర్మానం చేసింది. అయితే బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకోవడం లేదని తేల్చింది. బీజేపీ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ ధియోధర్ తో పాటు ఎంపీ జీపీఎల్ నరసింహారావు కూడా టీడీపీతో పొత్తుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. దీంతో టీడీపీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం కేసుల భయమే అని తెలుస్తోంది. సీబీఐ, ఈడీ సంస్థలు వివిధ కో ణాల్లో పార్టీలపై కేసులు నమోదు చేస్తుండడంతో ప్రాంతీయ పార్టీలు కేంద్రంతో కయ్యానికంటే వియ్యానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీతో బీజేపీ పొత్తు పె ట్టుకుంటుందో లేదో చూడాలి.
తిరుపతి ఉప ఎన్నికల్లో పట్టుబట్టి జనసేన మద్దతుతో బరిలోకి దిగిన బీజేపీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. ఈ కారణంగా జనసేన బలం కూడా తక్కువేనని వారు నిరూపించినట్లయింది. బీజేపీకి అంతో ఇంతో అడ్వాంటేజ్ ఉండేది. లోక్ సభ ఎన్నికల్లోనే అక్కడ మోదీ బొమ్మ ప్రధానంగా వాడుకోవచ్చు. అలాంటి ఎన్నికల్లోనూ కనీస ప్రభావం చూపలేని బీజేపీ అధికార పార్టీ వ్యూహాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తూ మిత్రపక్షం జనసేనను సైతం నిర్వీర్యం చేస్తోంది. అందులో భాగంగానే కొత్త వ్యూహాన్ని జీవీఎల్, సునీల్ ధియోధర్ అమలు చేస్తున్నారని అంటున్నారు