
ఒక విమర్శకు విలువ ఎప్పుడు వస్తుందంటే..? ప్రత్యర్థి దాన్ని స్వీకరించాలి.. తిప్పికొట్టాలి.. తిరిగి సవాల్ చేయాలి. అప్పుడే.. ఆ విమర్శ చేసిన వారి లక్ష్యం నెరవేరుతుంది. కానీ.. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ పప్పులు ఉడకట్లేదు. ఆ పార్టీ వ్యూహాన్ని పసిగట్టిన వైసీపీ.. టీడీపీ సైలెంట్ గా ఉంటున్నాయి. దీంతో.. కాషాయ దళానికి ఏం చేయాలో పాలుపోవట్లేదు.
Also Read: ఏపీపై బీజేపీ రెండు సర్జికల్ స్ట్రైక్స్? జగన్ పైనేనా?
అక్కడి పాచికనే..
తెలంగాణలో దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ.. తాను కోరుకున్నట్టుగా విపక్షాలు ప్రతిస్పందించడంతో.. అనుకున్న ఫలితాలను దక్కించుకొంది. అదే స్ట్రాటజీని ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేయాలని వ్యూహ రచన చేసింది. కానీ.. అక్కడి ప్రత్యర్థి పార్టీలు, ఎత్తుకు పై ఎత్తులు వేయడంతో బీజేపీ ఆటలు సాగడం లేదు.
Also Read: ఏపీ కొత్త సీఎస్ ఆయనే.. జగన్ కీలక నిర్ణయం?
ఎక్కడైనా ఇదే వ్యూహం..
దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలతో తమ వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేశారు. ఇది ఊహించకుండా.. అధికార పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్‌తో పాటు మీడియా కూడా బీజేపీ ట్రాప్‌లో పడింది. దీంతో బీజేపీ తేలిగ్గా తమ లక్ష్యం నెరవేర్చుకుంది.
ఏపీలో రెచ్చగొడుతున్నా..
గత రెండు రోజులుగా తిరుపతి కేంద్రంగా వైసీపీ, టీడీపీలపై బీజేపీ ఘాటైన విమర్శలు చేసింది. గత ప్రభుత్వాలు 60 ఏళ్లలో రూ.లక్ష కోట్ల అప్పులు చూపిస్తే .. వైసీపీ సర్కార్ మొదటి ఆరు నెలల్లోనే రూ.55 వేల కోట్లు అప్పులు చేసిందని
అక్రమ, అనైతిక విధానాలను ప్రోత్సహించడంతో రాష్ట్రాభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని కాషాయ నేతలు ఆరోపించారు. ఈ విధానాల వల్ల పారిశ్రామికవేత్తలు పారిపోయేలా ఏపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. కేంద్రం నిధులు సాయం చేస్తుంటే జగన్ తనపేరు పెట్టుకుని మాయ చేస్తున్నారని,. ఇళ్ల స్థలాల కోసం భూసేకరణకు ఖర్చు చేసిన రూ.7 వేల కోట్లలో రూ.3 వేల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. ఇంకా.. ఓ మెట్టు ఎక్కి.. టీడీపీ, వైసీపీ మతతత్వ రాజకీయాలు చేస్తున్నాయని కూడా అనేశారు. టీడీపీ హయాంలో ఎన్నో దేవాలయాలు పడగొట్టారని, ఇప్పుడు వైసీపీ హయాంలో దేవాలయాలతో పాటు దేవతల విగ్రహాలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఇంతటితో ఆగకుండా.. మత రాజకీయాలు నడిపే చంద్రబాబు నిద్రలేచినప్పుడల్లా తాను హిందువునని ప్రకటించుకునే ప్రయత్నం చేస్తుంటారని అన్న బీజేపీ నేతలు.. 14 ఏళ్లు సీఎంగా ఉండి సొంత జిల్లాను అభివృద్ధి చేయలేని అసమర్థుడు అన్నారు. చివరగా.. తెలంగాణలో ఒక సర్జికల్ స్ట్రైక్ కావాల్సి వస్తే.. ఏపీలో రెండు నిర్వహించాల్సిన అవసరం ఉందని అనేశారు. ఈ విధంగా.. అటు అధికార పార్టీని, ఇటు టీడీపీని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
స్పందించని వైసీపీ, టీడీపీ..
నిజానికి తమ ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం ఆ పార్టీల నేతలు చేస్తారని కాషాయ దళం ఎదురు చూసింది. అలా జరిగితే మరిన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొచ్చని.. బీజేపీ నేతలు ఆశించారనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ.. ఈ రెండు పార్టీలూ లైట్ తీసుకున్నాయి.
అసహనంలో బీజేపీ..
తమ పాచిక పారకపోవడంతో బీజేపీ అసహనంలో, ఆవేదనలో ఉందని సమాచారం. మతరాజకీయాలు చేస్తున్నాయని అన్నా కూడా రెండు పార్టీల నేతలు మాట్లాడకపోవడం వారిని నిరాశకు గురిచేసిందని తెలుస్తోంది. బీజేపీ కామెంట్లకు స్పందిచొద్దని ఇప్పటికే బాబు తమ కేడర్ కు సూచించినట్టు సమాచారం. సీఎం జగన్ సైతం ఇదే వ్యూహంలో ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఈ రెండు పార్టీలనూ బద్నాం చేయాలన్న లక్ష్యం నెరవేరట్లేదని కాషాయ నేతలు ఇబ్బంది పడుతున్నారనే ప్రచారం సాగుతోంది.
Comments are closed.