Homeఆంధ్రప్రదేశ్‌బీజేపీకి తీరని ‘పెద్దల‌’ క‌ష్టం!

బీజేపీకి తీరని ‘పెద్దల‌’ క‌ష్టం!

BJP

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సాధించింది బీజేపీ. సొంతంగానే ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌గ‌లిగే స్థాయిలో సీట్లు వ‌చ్చాయి. ఆ విధంగా లోక్ స‌భ‌లో సంపూర్ణ మెజారిటీ ద‌క్కించుకుంది. కానీ.. పెద్ద‌ల స‌భ‌లోనే కావాల్సినంత బ‌లం లేకుండా పోయింది. వ‌రుస‌గా రెండుసార్లు అధికారం సాధించిన‌ప్ప‌టికీ.. రాజ్య‌స‌భ‌లో స‌రైన మెజారిటీ సంపాదించ‌లేక‌పోయింది. అంతేకాదు.. ఇప్పుడు ఉన్న బ‌లం కూడా త‌గ్గిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో.. ఏం చేయాలో పాలుపోని కండీష‌న్లో ప‌డింది క‌మ‌ల‌ద‌ళం.

రాజ్య‌స‌భ‌లో మొత్తం స‌భ్యుల సంఖ్య 245. ఇందులో 233 మంది ప్ర‌త్య‌క్షంగా ఎన్నిక‌వుతారు. మిగిలిన వారిని కేంద్ర ప్ర‌భుత్వం సూచ‌న మేర‌కు రాష్ట్ర‌ప‌తి నామినేట్ చేస్తారు. స‌భ్యుల ప‌ద‌వీ కాలం ఆరు సంవ‌త్స‌రాలు ఉంటుంది. ప‌ద‌వీకాలం పూర్త‌యిన‌వారు దిగిపోతుండ‌గా.. కొత్త‌వారు ఎన్నిక‌వుతూ ఉంటారు. ఇది నిరంత‌రం సాగే ప్ర‌క్రియ‌. అయితే.. రాజ్య‌స‌భ‌లో ఏదైనా బిల్లు పాస్ కావాలంటే.. 123 మంది స‌భ్యుల మ‌ద్ద‌తు కావాల్సి ఉంటుంది. కానీ.. కేంద్రంలోని బీజేపీకి అంత బ‌లం లేదు. దీంతో.. ప్ర‌తిసారీ ‘పెద్ద’ గండాన్ని ఎదుర్కోవాల్సి వ‌స్తోంది.

ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి 93 మంది సభ్యులు ఉన్నారు. అంటే.. మెజారిటీకి 30 మంది త‌క్కువ‌గా ఉన్నారు. దీంతో.. ప్ర‌తీ బిల్లు నెగ్గ‌డానికి ఎవ‌రో ఒక‌రి మ‌ద్ద‌తు తీసుకోవాల్సిన ప‌రిస్థితి. ఇప్ప‌టి ప‌రిస్థితి ఇలా ఉండ‌గా.. బీజేపీ బ‌లం మ‌రింత త‌గ్గిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. వ‌చ్చే ఏడాది జూన్ లో 20 మంది, జులైలో 33 మంది, ఆగ‌స్టులో 18 మంది స‌భ్యులు ప‌ద‌వీ విర‌మ‌ణ పొంద‌నున్నారు. అయితే.. వీరిలో బీజేపీకి చెందిన వారు ఎక్కువ‌గానే ఉండ‌డం.. ఆ పార్టీని క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది.

ఉదాహ‌ర‌ణ‌కు వ‌చ్చే ఏడాది జూన్ లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే ఎంపీల్లో.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ఎన్నికైన వారు న‌లుగురు ఉన్నారు. వారిలో విజ‌య‌సాయిరెడ్డి, సురేష్‌ప్ర‌భు, సుజ‌నా చౌద‌రి, టీజీ వెంక‌టేష్ ఉన్నారు. వీరిలో విజ‌య‌సాయి మిన‌హా.. మిగిలిన ముగ్గురు బీజేపీలో ఉన్నారు. ఏపీలో వైసీపీకి ఉన్న బ‌లం దృష్ట్యా ఈ నాలుగు సీట్లూ.. జ‌గ‌న్ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి. అంటే.. బీజేపీ మూడు సీట్లు కోల్పోనుంది. ఇదే విధంగా ఉత్త‌ర ప్ర‌దేశ్ నుంచి 11 సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో 5 బీజేపీవి ఉన్నాయి. ఇవి ద‌క్కించుకోవాలంటే.. వ‌చ్చే ఏడాది జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికారం చేప‌ట్టాలి. కానీ.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అది శ‌క్తికి మించిన ప‌నేన‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. రాజ‌స్తాన్లోనూ ఇదే ప‌రిస్థితి. అక్క‌డ న‌లుగురు బీజేపీ ఎంపీలు ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. అవ‌న్నీ కాంగ్రెస్ కోటాలో ప‌డే ప‌రిస్థితి ఉంది. ఈ విధంగా.. రాజ్య‌స‌భ‌లో బీజేపీ బ‌లం బాగానే త‌గ్గిపోయే ప‌రిస్థితి. దీంతో.. ఇత‌ర పార్టీల‌పైనే ఆధారప‌డాల్సి ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular