Telangana Elections 2023: కాంగ్రెస్‌ గెలుపు కోరుకుంటున్న బీజేపీ లోకల్‌ లీడర్స్‌!

వాస్తవంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అయితే చివరి దశలో ప్రచారంతో పరిస్థితి కొంత మారిందని, అది రాష్ట్రంలో నిర్ణాయక శక్తిగా ఎదిగేలా చేస్తుందని కమలనాథులు భావిస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : November 28, 2023 1:35 pm

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: తెలంగాణలోని స్థానిక బీజేపీ నాయకులు కాంగ్రెస్‌ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది లోకల్‌ లీడర్స్‌ నుంచి. ఇది మొదట విచిత్రంగా అనిపించవచ్చు. కానీ గ్రౌండ్‌ రియాలిటీ మాత్రం ఇదే అంటున్నారు. బీజేపీ క్యాడర్‌.. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పార్టీ కోసం పనిచేస్తారు. ఇది అందరికీ తెలుసు. కానీ, ఈసారి మాత్రం కమలం క్యాడర్‌ కాంగ్రెస్‌ గెలుపును కోరుకుంటోందని తెలుస్తోంది. అందుకూ ఓ లెక్క ఉందని అంటున్నారు విశ్లేషకులు.

తాము గెలవకపోయినా..
వాస్తవంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అయితే చివరి దశలో ప్రచారంతో పరిస్థితి కొంత మారిందని, అది రాష్ట్రంలో నిర్ణాయక శక్తిగా ఎదిగేలా చేస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. అది కాకపోతే.. అధికార బీఆర్‌ఎస్‌ కన్నా.. కాంగ్రెస్‌ గెలవడమే మేలనుకుంటున్నారట. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే, ప్రాంతీయ పార్టీ బీఆర్‌ఎస్‌ కాలక్రమేణా ప్రభావం కోల్పోతుందని, ఇది రెండు జాతీయ పార్టీలు బీజేపీ, బీఆర్‌ఎస్‌ బలపడేందుకు, భవిష్యత్‌లో రెండు పార్టీల మధ్యే పోటీ నెలకొంటుందని భావిస్తున్నారని సమాచారం. తద్వారా వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి మార్గం సుగమం అవుతుందని పేర్కొంటున్నారు.

జాతీయనాయకత్వం ఇలా..
ఇక బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం మరోలో ఆలోచిస్తోంది. నరేంద్రమోడీ దీర్ఘకాల నినాదమైన ‘‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’’లో భాగంగా తెలంగాణలో బీఆర్‌ఎస్‌ గెలుపు కోరుతోంది. తద్వారా కాంగ్రెస్‌ను దెబ్బతీయడంతోపాటు 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రాభవాన్ని మరింత తగ్గించవచ్చని ఆలోచిస్తోంది. తద్వారా బీజేపీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడం సులభం అవుతుందని మోదీ లెక్కలు వేస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం జాతీయ రాజకీయాల విషయంలో బీఆర్‌ఎస్‌ను మిత్రపక్షంగా భావిస్తోంది.

హంగ్‌ ఏర్పడితే చక్రం తిప్పాలని..
ఇక జాతీయ నాయకత్వం మరో ఆలోచన కూడా చేస్తోంది. తెలంగాణలో ఎవరికీ మెజారిటీ రాకపోతే బీజేపీ చక్రం తిప్పుతుందని కమలనాథులు భావిస్తున్నారు. వీలైతే సీఎం పీటం కూడా దక్కుతుందని లెక్కలు వేస్తున్నారు. కాంగ్రెస్‌ జోరులో బీఆర్‌ఎస్‌ తక్కువ సీట్లు సాధిస్తే, బీజేపీ 10కి పైగా సీట్లు సాధిస్తే బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో కర్ణాటకలో జనతాదళ్‌కు చెందిన కుమారస్వామి తక్కువ సీట్లతో కర్ణాటక సీఎం అయ్యారు. తెలంగాణలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశాలను బీజేపీ కొట్టిపారేయడం లేదు. మొత్తంగా ఎన్నికలకు మరో రెండు రోజులే సమయం ఉండడంతో ఏం జరుగుతుందో చూడాలి.