Huzurabad: హుజూరాబాద్ ఎన్నికలను ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటున్నాయి. మొదటి నుంచి ప్రచారంలో తమ పంథాలో దూసుకెళ్తున్నారు. ఎవరి ఎత్తుగడలు, స్ట్రాటజీలు, అంచనాలు వారికున్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో రెండు పార్టీలు చాలా కష్టపడుతున్నాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానం కాళీ అయిన నుంచి వాటి ప్రచార పనులు మొదలు పెట్టాయి. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నుంచి వాటి వేగాన్ని మరింత పెంచాయి. అయితే కొందరు బీజేపీ నాయకులు హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో కనిపించలేదు. వారు ఎందుకు కనిపించలేదు ? కారణాలేంటి అన్న ప్రశ్నలు రాజకీయ విశ్లేషకులను ఆలోచింపజేస్తున్నాయి.

తీరిక లేకుండా గడిపిన నాయకులు
హుజూరాబాద్ గెలుపు కోసం టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, బీజేపీ నాయకులు తీరిక లేకుండా గడిపారు. ఆ స్థానాన్ని గెలుచుకునేందుకు తమ శక్తి యుక్తుల్ని అక్కడ అమలు చేస్తున్నారు. మొదటి నుంచీ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాము గెలిస్తే అది చేస్తామని, ఇది చేస్తామని ప్రచారాలు చేయడం ఒక ఎత్తయితే, ప్రలోభాలకు గురి చేయడం మరో ఎత్తు. ఇవి రెండు చేయడంలో ప్రధాన పార్టీలు ముందున్నాయి. నియోజకవర్గంలోని ప్రతీ మండలంలో గ్రామంలో కుల సంఘాలతో, యువజన సంఘాలతో మీటింగ్‌లు నిర్వహించాయి. తమ పార్టీ నుంచి ఇంత అని ప్యాకేజ్ మాట్లాడుకున్నాయి. డబ్బు, బహుమతులు, పదవుల ఆశ చూపాయి. తమ పార్టీ గెలుపు కోసం రెండు పార్టీలు శత విధాల ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు చివరి అంకంకు చేరుకోవడంతో ఆ ప్రయత్నాలను మరింత విస్తరించే అవకాశం ఉంది.
బీజేపీ నాయకులు ఎందుకు కనిపించలేదు..
ఈటల బీజేపీలో చేరన నాటి నుంచి ఆ పార్టీ నాయకుల నుంచి ఆయనకు పూర్తి సహకారం లభించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఇతర నాయకులు ఎప్పుడూ ఆయన వెంటే ఉన్నారు. బండి సంజయ్, రఘునందన్ రావు మొదటి నుంచీ ప్రచారంలో కనిపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన షెడ్యూల్ ప్రకారం ప్రచారంలో పాల్గొన్నారు. అయితే మరి కొందరు ముఖ్య నాయకులు హుజూరాబాద్ ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు. అందులో ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, సీనియర్ నాయకుడు ఇంద్రసేనారెడ్డిలు ప్రచారానికి దూరంగా ఉన్నారు. వీరు ఎందుకు ప్రచారానికి రాలేదన్న విషయంలో రాజకీయ విశ్లేషకులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. వీరు పార్టీపై అలిగారని, అందుకే దూరంగా ఉన్నారని అంటున్నారు. అయితే రాజసింగ్ ను మాత్రం ప్రచారానికి దూరంగా ఉండాలని పార్టీ చెప్పి ఉండవచ్చని భావిస్తున్నారు. రాజసింగ్ ప్రచారం చేస్తే ముస్లిం, మైనారిటీ ఓట్లు దూరమవుతాయని భావించి కావాలనే ఇలా చేసి ఉండవచ్చని చెబుతున్నారు. మరి ఏ కారణం చేత వారి దూరంగా ఉంచాలో ఆ పార్టీ నాయకులే బహిర్గత పరచాల్సిన అవసరం ఉంది.