YCP Jayaho BC Sabha : జయహో బీసీ సభ.. బీసీలే వెన్నెముక అన్న నినాదంతో విజయవాడలో వైసీపీ సర్కారు చేపట్టిన బీసీ గర్జన సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. బీసీలు ఈ సభకు పెద్దగా రాకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చి వెలవెలబోయింది. ఆర్టీసీ బస్సులను దారిమళ్లించి మరీ జనాలను విజయవాడ చేర్చినా ఎవరూ ఎక్కలేదు. ప్రజా రవాణా స్తంభించినా పెడచెవిన పెట్టి ఈ పనిచేసినా బీసీల నుంచి ఆశించిన స్పందన రాలేదు.

కడుపు నిండా … కరువు తీరా టిఫిన్, భోజనం’తో బీసీ గర్జనను సక్సెస్ చేసేందుకు వైసీపీ సర్కారు ఆపసోపాలు పడింది. అందుకే పసందైన విందు భోజనాలను సిద్ధం చేసింది. రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న వైసీపీ శ్రేణులకు ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నం భోజనం వరకూ వారు నచ్చీ..మెచ్చే ఆహారం పెట్టేందుకు భారీగానే ఖర్చు చేస్తోంది. ఇందుకుగాను ప్రత్యేక మెనూ రూపొందించింది. అయినా బీసీలు పెద్దగా రాకపోవడంతో సభ జనాలు లేక వెలవెలబోయింది.
జయహో బీసీ సభ ద్వారా ఏం ఉద్దరించారని.. బీసీలకు ఏం సాధించిపెట్టారని బీజేపీ విమర్శించింది. బీజేపీ నేత డా. పార్థసారథి ఈ మేరకు వైసీపీ తీరును తూర్పారపట్టారు. రాజకీయంగా బీసీలకు ఎన్నో అవకాశాలు ఇచ్చామంటున్న జగన్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు వైసీపీ ఇచ్చింది కేవలం 23శాతం అసెంబ్లీ సీట్లు మాత్రమే. మరి అంతెందుకు..అత్యధికంగా బీసీలున్న రాయలసీమలో కానీ.. ఉత్తరాంధ్రలో కానీ బీసీలకు వైసీపీ న్యాయం చేయలేదు. రాయలసీమలోని మొత్తం 52 అసెంబ్లీ సీట్లకు మీరు ఎంతమంది బీసీలకు ఇచ్చారంటే సమాధానం లేదు. సీఎం జగన్ సొంత జిల్లా కడప జిల్లాలో ఒక్కటంటే ఒక్కటి కూడా బీసీలకు వైసీపీ ఇవ్వకుండా అన్యాయం చేసింది వైసీపీనే కదా అని పార్థసారథి విమర్శించారు.
2024లో 67 శాతం జనాభా ఉన్న బీసీలు ఎంత మందికి సీట్లు ఇస్తారో వైసీపీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని బీజేపీ నేత డా. పార్థసారథి విమర్శించారు. 2.15 కోట్ల బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారో సమాధానం చెప్పాల్సి ఉంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 34శాతం ఉన్న రిజర్వేషన్ ను 24 శాతానికి తగ్గించి ఎంతో మందిని బీసీలు సర్పంచ్ లు, ఎంపీటీసీలు కాకుండా అడ్డుకున్నది వైసీపీ ప్రభుత్వం అని పార్థసారథి విమర్శించారు. సలహాదారులు, నామినేటెడ్, టీటీడీలోనూ బీసీలకు మొండి చేయి చూపారని లెక్కలతో సహా కడిగేశారు పార్థసారథి.