Kanna Lakshminarayana: రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఆయన పార్టీ మారడం ఖాయమని గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జనసేనలో.. ఏదో ఒక పార్టీలో చేరతారని టాక్ నడిచింది. ప్రధానంగా టీడీపీకి వెళతారని.. అందుకే ఆయన కోసం గుంటూరు2 స్థానాన్ని చంద్రబాబు ఖాళీగా పెట్టారని కూడా కామెంట్స్ వినిపించాయి. తాజాగా జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ కన్నాను కలిశారు. వైసీపీ విముక్త ఏపీ కోసం తాము చర్చించుకున్నట్టు ఇరువురు నేతలు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే జనసేన, బీజేపీ మిత్రులుగా కొనసాగుతున్నాయి. ఇటువంటి సమయంలో కొత్తగా వైసీపీ విముక్త ఏపీ కోసం చర్చించాల్సిన పని ఏముంటున్న ప్రశ్న వినిపిస్తోంది. అంతకు మించి వారి భేటీ వివరాలేవీ బయటకు రాలేదు. అయితే కన్నా లక్ష్మీనారాయణ సొంత పార్టీపై చేసిన కామెంట్స్, ఆయన చర్యలు, తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం జనసేన వైపు చూస్తున్నట్టు కనిపిస్తోంది.

కన్నా లక్ష్మీనారాయణ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నేత. కాంగ్రెస్ లో కీలక పదవులు చేపట్టారు. లాంగ్ టర్మ్ మంత్రిగా ఉన్నారు. గత ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. వైసీపీలో చేరుతారని భావించినా.. బీజేపీ హైకమాండ్ ఇచ్చిన ఆఫర్ తో ఆ పార్టీలో చేరారు. ఇలా చేరిన కొద్దిరోజులకే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. గత ఎన్నికల తరువాత కన్నా చొరవతోనే జనసేన, బీజేపీ మిత్రులుగా మారాయి. కానీ ఆయన్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి సోము వీర్రాజుకు అప్పగించారు. అప్పటి నుంచి కాస్త ముభావంతోనే ఉన్నారు. పార్టీలో కూడా ఏమంత యాక్టివ్ గా లేరు. అయితే ఇటీవల పవన్ బీజేపీ తనను దూరం పెట్టిందన్న కామెంట్స్ నేపథ్యంలో కన్నా రియాక్టు అయ్యారు. సోము వీర్రాజు వ్యవహార శైలే కారణమంటూ కామెంట్స్ చేశారు. ఈ పరిణామాల క్రమంలో ఆయనకు టీడీపీ నుంచి ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. పార్టీలోకి వస్తే తగిన గౌరవం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో కన్నా టీడీపీలో చేరుతారని అంతా భావించారు.
అయితే అనూహ్యంగా కన్నా జనసేన వైపు చూస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చాలా ఈక్వేషన్స్ తో ఆయన పవన్ వైపు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. సంక్రాంతి తరువాత చాలామంది నాయకులు జనసేనలో చేరే అవకాశముంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ తరువాత నాదేండ్ల మనోహర్ అన్నీతానై వ్యవహరిస్తున్నారు. కన్నాను రప్పించి కీలక బాధ్యతలు అప్పగించాలని పవన్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఒక వేళ పొత్తులు కుదిరితే సీనియర్ల జాబితా ను చూపించి వీలైనన్ని ఎక్కువ స్థానాలు అడగవచ్చన్న భావనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. పైగా కన్నా లక్ష్మీనారాయణకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. పాత పరిచయాలు అధికం. ఇతర జిల్లాల్లో సైతం అనుచరవర్గం ఉంది. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడంతో కాషాయ దళంతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కన్నాను కనుక జనసేనలో చేర్చుకుంటే లాభిస్తుందని పవన్ భావిస్తున్నారు. అందుకే నాదేండ్ల మనోహర్ కన్నాతో కీలక చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం బీజేపీ, జనసేన మిత్రులుగా కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కలిసే నడవాలని భావిస్తున్నాయి. అటు టీడీపీ సైతం ఆ రెండు పార్టీలను కలుపుకోవాలని చూస్తోంది. బీజేపీ హైకమాండ్ మాత్రం టీడీపీని దూరం పెడుతోంది. అటు జనసేన సైతం ఆచీతూచీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నేతలను జనసేన వైపు చేర్చుకుంటే ఢిల్లీ పెద్దలు ఎలా రియాక్టవుతారన్నదే ప్రశ్న. అయితే రాజకీయ పార్టీలు ఎవరికి వారు బలపడాలన్నది వ్యూహం అని.. దానికి అభ్యంతరాలు వ్యక్తమయ్యే చాన్సే లేదని జన సైనికులు భావిస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ చేరికతో జనసేనలోకి నాయకులు క్యూకడతారని వారు నమ్మకంగా చెబుతున్నారు.