
Dalitha Bandhu Scheme: దళిత బంధు పథకం.. దళితుల సంక్షేమం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ పథకం. ఇది చాలా మంచి పథకం. దీంతో నిజంగానే దళితులు అభివృద్ధి చెందొచ్చు. కానీ దీనిని తీసుకొచ్చిన సమయం, పథకం ప్రారంభించిన చోటు చాలా వివాదాస్పదం అయ్యాయి. హుజూరాబాద్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకంగా దీనిని రాష్ట్ర ప్రజలందరూ భావించారు. ప్రతిపక్షాలు కూడా ఇదే ఆరోపణలు బహిరంగంగానే చేశాయి. దీనికి కారణాలు లేకపోలేదు.
హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా..
దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో ప్రారంభించారు. సరిగ్గా హుజూరాబాద్ ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని ప్రకటించడం, దానిని కావాలనే హుజూరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించడం వంటివి కొంత వివాదాస్పదం అయ్యాయి. తాము ఏ పథకం ప్రారంభించినా హుజూరాబాద్ నుంచే ప్రారంభిస్తామని, ఆ సంప్రదాయం ప్రకారమే ఇక్కడే చేస్తున్నామని టీఆర్ఎస్ శ్రేణులు ప్రకటించాయి. రైతుబంధు పథకం కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించామని తెలిపాయి. కానీ దానిని హుజూరాబాద్ ప్రజలు కూడా నమ్మలేదని ఇప్పుడు అర్థం అవుతోంది. ఈ పథకాన్ని ప్రారంభించిన గ్రామం శాలపల్లి గ్రామంలో ఓట్లు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా వచ్చాయి. ఆ గ్రామంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ముందంజలో ఉన్నారు.
ఎందుకు పని చేయలేదు ?
దళిత బంధు పథకం(Dalitha Bandhu Scheme)పై టీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కేవలం ఈ పథకం ద్వారా మాత్రమే తమకు 60 నుంచి 70 వేల ఓట్లు వస్తాయని అంచనా వేసింది. మొదటి నుంచి అదే ధీమాతో ఉన్నాయి. కానీ పథకం ప్రారంభించిన చోటే టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఫలితం రావడం ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. అయితే దళితబంధు పథకం ఓట్లు రాల్చకపోవడానికి కారణాలేంటి అనే దానిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దళితులు టీఆర్ఎస్‌ను నమ్మడం లేదని అంటున్నారు. దళితుడినే సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని, ఇక అప్పటి నుంచి ప్రతీ విషయంలో మోసపోతుననామని భావన వారిలో ఉందని చెబుతున్నారు. ఎస్సీ కార్పోరేషన్‌కు నిధుల లేమి, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని, ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడం వంటి విషయాలు టీఆర్ఎస్‌కు ఇబ్బందిగా మారాయి. వాటిలాగే ఈ పథకం కూడా మూణ్నాల ముచ్చటే అవుతుందని భావించారని తెలుస్తోంది.
సరిగ్గా ఎన్నికలకు ముందు ప్రకటించిన దళితబంధు పథకం కొంత మందికే ఉపయోగపడింది. నియోజకవర్గం మొత్తం లబ్దిదారులను గుర్తించినప్పటికీ కొంత మందికే ఇప్పటి వరకు డబ్బులు బ్యాంక్ అకౌంట్‌లో పడ్డాయి. వాటిని కూడా పూర్తి స్థాయిలో కొందరు వినియోగించుకోలేకపోయారు. ఎన్నికల కమిషన్ నిబందనల వల్ల దళితబంధు ఆగిపోయింది. మరి ఎలక్షన్ అయిపోయిన తరువాత దానిని తిరిగి ప్రారంభిస్తారో లేదో అన్న విషయంలో దళితులు అనుమానంగానే ఉన్నారు. హైదరాబాద్‌లో వరదసాయం, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు అయిన వెంటనే ప్రభుత్వం పట్టించుకోకపోవడం వంటి విషయాలను హుజూరాబాద్ దళితులు గమనించారని, అందుకే టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో వ్యతిరేకంగా ఓట్లు వేశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే దళితబంధు పూర్తి స్థాయిలో ఓట్లు రాల్చలేదని చెబుతున్నారు.
Also Read: రేవంత్ కు షాక్: దళితబంధుకు కాంగ్రెస్ లో మద్దతు..కీలక నేతల తిరుగుబాటు?