Huzurabad By Election Result: హుజూరాబాద్ లో ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లలో మొదట టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. పోస్టల్ బ్యాలెట్లలో 344 ఓట్ల లీడ్ సాధించింది టీఆర్ఎస్. అయితే తొలి రౌండ్ లో మాత్రం బీజేపీ ఆధిక్యం కనబరిచింది. బీజేపీకి 4610, టీఆర్ఎస్ కు 4444 ఓట్లు, కాంగ్రెస్ కు 119 ఓట్లు వచ్చాయి. ఫస్ట్ రౌండ్ లో 166 ఓట్ల ఆధిక్యాన్ని బీజేపీ కనబరిచింది.

ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు ప్రజా ఏక్తా పార్టీ వల్ల మరోసారి ఇబ్బంది ఎదురైనట్లు స్పష్టమవుతోంది. కారు గుర్తును పోలిన రోటీ మేకర్ గుర్తుకు 122 ఓట్లు పోలయ్యాయి. ఈ గుర్తును ప్రజా ఏక్తా పార్టీ సాధించింది. ఆ పార్టీ నుంచి సిలివేరు శ్రీకాంత్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ కంటే కూడా ఈ గుర్తుకే ఎక్కువ ఓట్లు పోలవడం విశేషం. కారును పోలి ఉండడంతో రోటి మేకర్ ఓట్లు చీల్చి టీఆర్ఎస్ కు నష్టం చేసినట్టుగా తెలుస్తోంది.
ఫస్ట్ రౌండ్ లోనే రోటీమేకర్ కు ఇన్ని ఓట్లు వచ్చాయంటే అన్ని రౌండ్స్ ముగిసేసరికి ఈ గుర్తుకు పోలయిన ఓట్ల సంఖ్య ఎంత ఉంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇక కమలాన్ని పోలి ఉన్న వజ్రం గుర్తుకు కూడా ఓట్లు భారీగా పడుతున్నట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి పోలిన గుర్తులున్న పార్టీలకు బీజేపీ, టీఆర్ఎస్ ఓట్లు చీలాయని.. టఫ్ ఫైట్ లో ఈ ఓట్లు ఆయా పార్టీలను దెబ్బతీస్తుందనే ఆందోళన నెలకొంది.