కేంద్రంలో రెండు సార్లు అధికారం చేపట్టిన బీజేపీ చూపు ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మీద పడిందా..? అందులోనూ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ను టార్గెట్ చేసిందా..? అందుకే జగన్‌ను మచ్చిక చేసుకొని రాజకీయాలు నడుపుతోందా..? బీజేపీ అండను చూసుకొని జగన్ చంద్రబాబు మీదికి మరింత రెచ్చిపోతున్నారా..? రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో కాంగ్రెస్‌తో జతకలిసి జగన్‌ను 16 నెలల పాటు జైలు గోడల మధ్య పెట్టారు. ఆ కోపం జగన్‌లోనూ ఇప్పటికీ అలానే ఉంది. దానికి బదులు తీర్చుకోకుంటే ఇక ఇంత కష్టపడి అధికారంలోకి వచ్చి ఎందుకనేది ఆయన ఆలోచన కూడా కావచ్చు. బాబుని కోర్టు మెట్లు ఎక్కించాలన్నది జగన్ కసి అన్నా తప్పు లేదు. ఆయన వైపు నుంచి చూసినప్పుడు, ఆయనలా ఆలోచించినప్పుడు అది న్యాయమే అనిపిస్తుంది.
ఇటీవల జగన్ ఢిల్లీ టూర్ కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందులో ముఖ్యఅంశంగా సీబీఐ విచారణ ఉందని తెలుస్తోంది. అందుకే అమిత్ షాను రెండుసార్లు కలిశారనేది టాక్. అమిత్ షా ముందు జగన్ అమరావతి రాజధాని భూముల మీద సీబీఐ విచారణ డిమాండ్ పెడితే ఆయన ఓకే అంటారా..? బీజేపీ అంత తేలిగ్గా అంగీకరిస్తుందా..? ఇక బాబు మీద సీబీఐ విచారణ జరిపిస్తే బీజేపీకి ఏంటి ఒరిగేది..? రాజకీయాల్లో లాభ నష్టాలే కొలమానంగా ఉంటాయి. జగన్‌కి బాబు అడ్డు, ఆయన్ని తొలగిస్తే జగన్‌కి ఏపీలో ఎదురు ఉండదు. ఆయన చెలరేగిపోతారు. అపుడు ఆయన బీజేపీ చేతికి ఊరికే అందుతారా. అందుకే అందువల్ల బీజేపీ సీబీఐ విచారణ విషయంలో మౌనాన్నే కంటిన్యూ చేస్తుందని అనుకోవాలి. నిజానికి బీజేపీకి బాబు మీద విచారణ జరిపించాలన్న కోరికే బలంగా ఉంటే ఈ ఏడాది మార్చి నెలలోనే జగన్ రాసిన లేఖకు అర్జంటుగా స్పందించి ఉండేది. అది మూలన పడేశారు అంటే బీజేపీలో ఏవో కొత్త ఆలోచనలు ఉన్నట్లే కదా.
బాబు ఇప్పుడు ఏపీలో వట్టి విపక్ష నేత మాత్రమే. పైగా ఆయన బీజేపీని శరణు కోరుతున్నాడు. అందువల్ల బీజేపీకి ఆయన నుంచి ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఇక బీజేపీ చూపు 2024 ఎన్నికల మీద ఉంది. వైసీపీ బీజేపీతో తెర వెనక బంధాలు తప్ప డైరెక్ట్‌గా పొత్తులు ఎప్పటికీ పెట్టుకోదు. అదే బాబు అయితే సై అంటారు. ఎవ్వరితో పొత్తు పెట్టుకున్నా బీజేపీకి మహా అయితే పది నుంచి పదిహేను సీట్ల వరకు వస్తాయి. అంతేకానీ సొంతంగా అధికారంలోకి వచ్చేంత ఆ పార్టీకి లేదు. దాంతో ఎన్నికల ముందర బాబుతో దోస్తీ కట్టాలన్న వ్యూహం ఏదో బీజేపీకి ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో జగన్‌కే ఎప్పటికీ సీఎం సీటు అప్పగించడానికి బీజేపీ ఏం అమాయక పార్టీ కాదనేది విశ్లేషకుల అభిప్రాయం. అందుకే జగన్ కూడా తెలివిగానే సీబీఐ విచారణ డిమాండ్ పెట్టారు. ఇప్పుడు బీజేపీ నో అంటే ఆ పార్టీ డబుల్ స్టాండర్డ్, అసలు రంగు కూడా ఆయన చూసేందుకు వీలుంటుంది. మరి బీజేపీ తీరును కనిపెట్టి జగన్ ఇలాగే స్నేహబంధం కొనసాగిస్తారా.. తప్పుకుంటారా చూడాలి మరి.