అమరావతి అంశంలో బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షడు సోము వీర్రాజు స్పష్టంగా తన వైఖరి తెలియజేశాడు. అమరావతి విషయంలో బీజేపీ కానీ, కేంద్రం కానీ జోక్యం చేసుకోదు అన్నారు. అది రాష్ట్ర పరిధిలో అంశం కావున దాని విషయంలో మేము కలుగజేసుకొనేది లేదు అన్నారు. అలాగే అమరావతి విషయంలో పూర్తిగా బాబుదే తప్పు అన్నట్లుగా ఆయన తన ప్రసంగంలో తెలియజేశారు. లక్ష కోట్లతో ప్రపంచ స్థాయి రాజధాని కడతానన్న బాబు, ఏమి చేయలేకపోయారని అన్నారు. అమరావతి విషయంలో బీజేపీ ఇలాంటి స్టాండ్ తీసుకోవడానికి కారణం భవిష్యత్ ప్రయోజనాలే అని తెలుస్తుంది. బాబు మాదిరి అమరావతి అంశాన్ని ప్రోత్సహించి, అక్కడ రైతుల పక్షాన నిలబడి రెండు ప్రాంతాల ప్రజలకు దూరంకావడం ఇష్టం లేకే ఆయన అలా మాట్లాడారు అనే అనుమానం కలుగుతుంది.
Also Read: బాబును రాజీ’డ్రామా’లతో కొట్టాలనుకున్న జగన్
ఇక మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అమరావతికి పూర్తి మద్దతు ఇవ్వడంతో పాటు, సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకించారు. రాజధానిని అమరావతి నుండి కదలనీయను అని ఆయన చెప్పడం, అక్కడి రైతులకు ధైర్యం కలిగించింది. తీరా సోము వీర్రాజు రంగంలోకి దిగి పూర్తిగా కొత్త వర్షన్ ఎత్తుకున్నారు. కాగా మూడు రాజధానుల విషయంలో బీజేపీ చేయించిన అంతర్గత సర్వేలో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు అమరావతి అంశాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం అందినట్లు తెలుస్తుంది. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడి, ఉత్తరాంధ్ర మరియు రాయలసీమలో వ్యతిరేకత మూటగట్టుకోవడం ఎందుకు అనేది బీజేపీ ఆలోచనగా తెలుస్తుంది.
Also Read: ఆ టీడీపీ నేత ఒంటరి పోరాటం ఫలించేనా?
రాజధాని అమరావతికి కట్టుబడి బాబు చేస్తున్న ఉద్యమానికి ఇంత వరకు ప్రజామద్దతు లేదు. రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు కొందరు బాబును ఈ విషయంలో వ్యతిరేకిస్తుండగా, ప్రజామద్దతు ఆశించడం అత్యాశే అవుతుంది. బాబు అమరావతి వలన పొందే ప్రయోజనాలు ఏమైనా కానీ, రెండు ప్రాంతాలకు దూరం అవుతున్నాని తెలిసినా అమరావతి ఉద్యమాన్ని వదలడం లేదు. రాష్ట్రంలో మూడు రాజధానుల విషయంలో ప్రజా తీర్పు ఇలా ఉండగా, బీజేపీ దాని జోలికి పోకపోవడం మంచిది కాదని ఆలోచన చేసింది. అలా అని మూడు రాజధానుల నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం అని చెప్పక పోవడం గమనార్హం. అలా చెవితే టీడీపీ అడిగే కొన్ని ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది అందుకే ఈ విషయంలో బీజేపీ మేము ప్రేక్షకులం మాత్రమే అని నిర్ధారించింది.