
ఇప్పుడు ఏపీ కేంద్రంగా మత రాజకీయాలు పుట్టుకొస్తున్నాయి. ఇన్నాళ్లు మత రాజకీయాలకు దూరం అన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు మత రాజకీయాలు చేస్తున్నారు. ఇక ఆది నుంచి మతాన్నే నమ్ముకుని పార్టీని నడిపిస్తున్న బీజేపీ.. ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తోంది. మరికొద్ది రోజుల్లో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ క్రమంలో ఈ ఉప ఎన్నికలో బీజేపీ మతాన్నే నమ్ముకుంది. మతాన్ని కేంద్రబిందువుగా చేసుకుని ఎన్నికల ప్రచార బరిలో దిగింది. దాన్నే ఎన్నికల ప్రధానాస్త్రంగా మలచుకుంది.
Also Read: కాంగ్రెస్ లో సంచలనం: టీపీసీసీ చీఫ్ గా జీవన్ రెడ్డి?
ముఖ్యంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయి. విగ్రహాల విధ్వంసం, దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. వీటనే ప్రధాన అస్త్రాలుగా తీసుకొని ప్రస్తావించబోతోంది బీజేపీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హిందూ వ్యతిరేకిగా ముద్ర వేయడానికి శాయశక్తులా ప్రయత్నాలను ప్రారంభించింది. మొన్నటికి మొన్న శ్రీకాళహస్తిలో నిర్వహించిన ఓబీసీ ప్రతినిధుల సభలో పాల్గొన్న నేతలు ఇదే అంశాన్ని స్పష్టం చేశారు కూడా. ఈ 18 నెలల కాలంలో జగన్ ప్రభుత్వంపై రాష్ట్రంలో పెద్దగా వ్యతిరేకత ఎదురు కాలేదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేకపోవడం వల్ల తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి ప్రత్యామ్నాయంగా మతాన్ని తెర మీదికి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇదివరకు రాజకీయంగా దుమారం రేపిన తిరుపతి రెండు కొండలు అనే నినాదాన్ని కూడా బీజేపీ భుజాన వేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇక మరోవైపు తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్‌గా తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ను దింపింది పార్టీ అధిష్ఠానం. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన ఆయన.. తనదైన శైలిలో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు కూడా. తిరుపతి ప్రజలందరూ హిందూ ఓటుబ్యాంకుగా రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ పిలుపునిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక పోరాటం.. వైసీపీ–-బీజేపీ మధ్య కాదని, బైబిల్–-భగవద్గీత, రెండు కొండలు–-ఏడుకొండల మధ్య కొనసాగుతున్న పోరుగా అభివర్ణించడం.. ప్రచార తీవ్రతను చాటుతోంది.
Also Read: అప్పుడు పట్టించుకోలేదు.. ఇప్పుడు రచ్చ చేస్తున్నారు..
తిరుపతిలో నివసిస్తున్న హిందువులు ఓటు బ్యాంకుగా మారాల్సిన అవసరం ఏర్పడిందని, ఆ సమయం సమీపించిందని బండి సంజయ్ చెబుతున్నారు. విగ్రహాల విధ్వంసకులకు తిరుపతి ప్రజలు బుద్ధి చెప్పాలని సూచిస్తున్నారు. రామతీర్థంలో శ్రీరామచంద్రులవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారికి, అంతర్వేదిలో రథాన్ని తగులబెట్టించిన వారిని క్షమించకూడదని విజ్ఙప్తి చేస్తున్నారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి కిందటే వరుస ట్వీట్లను సంధించారు. ధర్మం గురించి ఆలోచించే వ్యక్తులనే తిరుపతి ఉప ఎన్నికలో గెలిపించాలని కోరారు. హిందువులకు అతిపెద్ద ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతిలో బీజేపీని గెలిపించి ధర్మ రక్షణకు పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. హిందువుల సహనాన్ని జగన్ సర్కార్ పరీక్షిస్తోందని, తమ ఓపికను పిరికితనంగా భావిస్తున్నట్టు కనిపిస్తోందని అన్నారు. హిందువుల సత్తా ఏమిటో తిరుపతి ఉప ఎన్నికల్లో జగన్ సర్కార్‌కు తెలిసేలా చేయాలని సూచించారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్