BJP High Command- Moinabad Episode: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లవ్యవహారానికి సంబంధించి ఆడియో టేపులు విడుదల కావడం దేశరాజకీయాల్లో సంచలనంగా మారింది. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేసిందని.. ఆడియో టేపులే ఇందుకు సాక్షమని టీఆర్‌ఎస్ విరుచుకుపడుతోంది. ఈ డ్రామాను టీఆర్‌ఎస్సే ప్లాన్ చేసిందని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. ఐతే ఈ వ్యవహార్ని మొన్నటి వరకు తేలిగ్గా తీసుకున్న బీజేపీ పెద్దలు.. శుక్రవారం నాటి పరిణామాలతో అప్రమత్తమయ్యారు. ఆడియో టేపులు బయటకు రావడం, 7 నిమిషాలు, 27 నిమిషాల ఆడియో టేప్‌లో బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్ గురించి నంబర్ 1, నంబర్ 2 అని మాట్లాడుకోవడం.. ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తే నేరుగా సంతోష్‌తోనే భేటీని ఏర్పాటు చేస్తామనడం, డబ్బుల గురించి కూడా మాట్లాడాన్ని.. పార్టీ పెద్దలు విశ్లేషిస్తున్నారు.

ఆ ముగ్గురితో పార్టీ సంబంధాలపై ఆరా..
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులుగా చెబుతున్న రామచంద్రభారతి, నందకుమర్, సింహయాజికి పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు లేవని ఢిల్లీ వర్గాలు బలంగా చెబుతున్నాయి. ఐనప్పటికీ వారు బీఎల్.సంతోష్, సునీల్‌బన్సల్ గురించి మాట్లాడుకోవడం.. ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తే నేరుగా సంతోష్‌తోనే భేటీని ఏర్పాటు చేస్తామనడం, డబ్బుల గురించి కూడా మాట్లాడాన్ని.. పార్టీ పెద్దలు సీరియస్‌గా తీసుకున్నారట. పార్టీలో ఎవరితో అయినా వీరికి సంబంధాలు ఉన్నాయా? అనే అంశంపై బీజేపీ జాతీయ నాయకత్వం ఆరా తీస్తున్నట్లు సమాచారం. ముగ్గురు నిందితులకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
చట్టబద్ధంగా ఎదుర్కొనేందుకు..
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని ఇటు రాజకీయంగానూ.. అటు చట బద్ధంగానూ ఎదుర్కోవాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో శుక్రవారం పలువురు బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఫామ్‌హౌస్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపించాలని.. కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నేతృత్వంలోని బృందం.. ఈసీకి విజ్ఞప్తి చేసింది. అసరమైతే సీబీఐ, ఈడీలను కలిసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ బీజేపీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిదే. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఓడిపోతామనే భయంతోనే టీఆర్‌ఎస్ కుట్ర చేసిందని ఆరోపించారు. దీని వెనక ఉన్న నిజానిజాలను సీబీఐ, సిట్టింగ్ జడ్జితో నిగ్గుతేల్చాలని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరగనుంది.

హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తదుపరి కార్యాచరణ చేపట్టాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ఏకంగా పార్టీ జాతీయ నాయకత్వంపైనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ఈ విషయాన్ని అంత ఈజీగా వదలిపెట్టకూడదని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.