BJP- YCP: ఏపీలో పార్టీ బలోపేతానికి బీజేపీ అగ్రనేతలు చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ అవేవీ సత్ఫలితాలనివ్వడం లేదు. పొరుగున ఉన్న తెలంగాణలో అధికార పార్టీ, ప్రధాన విపక్షం కాంగ్రెస్ కు దీటుగా బీజేపీ నిలబడుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారం తధ్యమన్న రేంజ్ లో పోరాడుతోంది. ఏపీలో మాత్రం ఆ పార్టీ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది. భారీగా నాయకగణం, ఫాలోవర్స్ ఉన్నా మాత్రం ఎందుకో ఆశించిన స్థాయిలో బలోపేతం కాలేకపోతోంది. అయితే దీనికి అనేక కారణాలున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామి పార్టీగా ఉంది. ఇప్పుడు వైసీపీ సర్కారుతో రహస్య స్నేహితుడిగా కొనసాగుతోంది. అందుకే బీజేపీ నేతల ప్రయత్నాలను ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదు. దాని ప్రభావమే ఏపీలో బీజేపీ బలోపేతం పై పడుతోంది. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో కేంద్రం పవర్ ను ఏ విధంగా ఉపయోగిస్తుందో అందరికీ తెలిసిందే. కానీ ఏపీలో మాత్రం అందుకు విరుద్ధం. జగన్ సర్కారుకు సొంత ప్రభుత్వం మాదిరిగా పరిగణించి కేంద్రం సాయమందిస్తోంది. అన్నివిధాలా సహకరిస్తోంది. చివరకు రాష్ట్రం నాశనమైపోయే నిర్ణయాలకు కూడా బీజేపీ సహకరిస్తోందన్న భావన ప్రజల్లో నెలకొనేటంతగా ప్రోత్సహిస్తోందన్న ప్రచారం అయితే ఏపీలో ఉంది.

ఏపీలో ఆదరణ పెంచుకోవడానికి బీజేపీ వరుస కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. ఇటీవల యువ సంఘర్షణ యాత్రను సైతం చేపట్టింది. ప్రాజెక్టుల బాట సైతం నిర్వహించింది. కానీ ఏ మాత్రం బలం పుంజుకున్న దాఖలాలు కనిపించడం లేదు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల సభలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించింది. కానీ యాత్రలు, నేతల పర్యటనలు ఇవేవీ బీజేపీని ప్రజల దరికి చేర్చే అవకాశమే లేదు. కానీ ఒకే ఒకటి చేస్తే మాత్రం ప్రజలు అక్కున చేర్చుకుంటారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వైసీపీతో తాము లేమన్న భావన కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటే ఏపీ ప్రజలు నమ్ముతారని.. అంతవరకూ మాత్రం బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసిన సుఖం లేదంటున్నారు.
అసలు రాష్ట్ర బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి టార్గెట్ చేసే పనిలేదు. కేంద్ర పెద్దలను నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచిస్తే చాలు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులకు లెక్క చూపకపోయినా,,,సీబీఐ పై ఎదురు కేసులు పెడుతున్నా…న్యాయ వ్యవస్థపై దాడులు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం తనకు పట్టకుండా వ్యవహరిస్తోంది. అయితే ఇది ఏపీ బీజేపీ నేతలకు మాత్రం ప్రతిబంధకంగా మారింది. తామ పోరాటానికి రాష్ట్ర ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. బీజేపీ, వైసీపీని ఒకే తాటిలో కడుతున్నారు. ఇటీవల పార్టీ హైకమాండ్ ఆదేశాలతో పోరాటం చేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. కానీ ప్రజల నుంచి స్పందన రాకపొవడంతో వారు సైలెంట్ అవుతున్నారు.

చాలామంది ఇతర పార్టీ నాయకులు బీజేపీలో చేరారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలని భావించారు. ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగానే పోరాటం చేశారు. కానీ తాము ఒక ఆలోచన చేస్తే.. బీజేపీ పెద్దలు మరోలా ఆలోచించడం ప్రారంభించారు. రాష్ట్ర బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తుంటే.. వైసీపీ నిర్ణయాలకు కేంద్ర పెద్దలు సమర్థిస్తూ వచ్చారు. ఇప్పటివరకూ జరిగింది కూడా అదే. దీంతో ఎందుకొచ్చింది గొడవ అంటూ చాలా మంది బీజేపీ రాష్ట్ర నాయకులు నైరాశ్యంలోకి వెళ్లిపోయారు.