Bigg Boss 6 Telugu- Chalaki Chanti: బిగ్ బాస్ ఎమోషనల్ పంచాడు.. మళ్లీ ఏడిపించాడు. తాజాగా ఈరోజు రాత్రి ప్రసారమయ్యే షోకు సంబంధించిన ప్రోమోను వదిలాడు. అది పూర్తిగా భావోద్వేగంతో సాగింది. కంటెస్టెంట్ల మాయని గాయాలను కళ్లకు కట్టింది. అందరినీ కంటతడి పెట్టించింది. ‘సిసింద్రీ’ టాస్క్ పేరిట గత మూడు నాలుగురోజులుగా చిన్న పిల్లల బొమ్మలను ఇచ్చి కంటెస్టెంట్లతో కెప్టెన్సీ టాస్క్ లు ఆడిస్తున్నాడు. బిగ్ బాస్. ఈక్రమంలోనే నలుగురు గెలిచి ఇంటి కెప్టెన్ రేసులో నిలబడ్డారు.

సిసింద్రీ టాస్క్ ముగియడంతో ఆ బొమ్మలను స్టోర్ రూంలో పెట్టాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. మూడునాలుగు రోజులుగా అపురూపంగా చూసుకున్న బొమ్మలను ఇచ్చేస్తుంటే భావోద్వేగం ఆపుకోలేక కంటతడి పెట్టారు కంటెస్టెంట్. ఈ సందర్భంగా తమ జీవితంలో పిల్లలతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు.
2015లో తనకు థాయిరాడ్ ఎక్కువై పాప కడుపులోనే చనిపోయిందని.. ఇప్పటికీ పిల్లలు లేరని.. తన చెల్లెలు కూతురిని పెంచుకున్నామని..చివరకు చెల్లెలు తన కూతురును తీసుకొని వెళుతుంటే ప్రాణాలు పోయినంత పని అయ్యిందని కంటెస్టెంట్ సుదీప తన జీవితంలోని చేదు జ్ఞాపకాన్ని పంచుకుంది.
తను చిన్నప్పటి నుంచి నాన్న ప్రేమకు దూరంగా ఉన్నానని.. చిన్నప్పుడే నాన్నచనిపోవడంతో అసలు నాన్న అని పిలవలేదని.. కానీ తన వైఫ్ ఇప్పుడు 7వ నెల అని.. పుట్టబోయే బిడ్డతో ఆ కోరిక తీర్చుకుంటానని సింగర్ రేవంత్ ఎమోషనల్ అయ్యాడు.
ఇక దత్తత తీసుకొని పెంచుకుంటున్న సీరియల్ నటి కీర్తి కూడా ఎమోషనల్ అయ్యింది. బిగ్ బాస్ లోకి వచ్చేముందు తన పాప లేదు అని కాల్ వచ్చిందని.. చివరి నిమిషంలో కూడా తాను పాప దగ్గర లేకుండాపోయానని కీర్తి ఏడ్చేసింది.

ఇక హార్ట్ బీట్ లేని పాపను మూడో నెలలో డాక్టర్లు తీసేశారని.. అది తలుచుకొని తాము గుండె పగిలేలా ఏడ్చేమాని మెరినా-రోహిత్ ఏడ్చేశారు.
అగ్ని ప్రమాదంలో తన కళ్లముందే మా అమ్మ చనిపోయిందని.. గంటన్నర సేపు ఒక్కడినే గుండెలు పగిలేలా ఏడ్చానని.. అందుకే నాకు ఇద్దరు ఆడకూతుళ్లను ఇచ్చాడని.. వారిలో మా అమ్మను చూసుకుంటున్నానని చలాకీ చంటి ఎమోషనల్ అయ్యారు. తల్లిదండ్రులు ఉన్నవాళ్లు అడుక్కుతినండని.. కానీ పిల్లలను మాత్రం రోడ్డుమీద వదిలేసి అనాథలను చేయవద్దని చంటి ఏడుస్తూనే పిలుపునిచ్చాడు..
మొత్తంగా ఈరోజు ఎపిసోడ్ ఫుల్ ఆఫ్ ఎమోషనల్ గా సాగుతుందని అర్థమవుతోంది. ఈ ప్రోమో వీడియో చూస్తే మీ కళ్లు కూడా చమర్చడం ఖాయంగా కనిపిస్తోంది.