CM Jagan: ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన తరువాత అన్ని రకాలుగా కుదేలైంది. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ఉపయోగించుకోవచ్చని విభజన చట్టంలో ఉన్నా.. ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకుంది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాజధాని పనులకు శంకుస్థాపన కూడా జరిగింది. అయితే అభివృద్ధిని మరిచిన చంద్రబాబు రియల్ ఎస్టేట్ రంగంపై దృష్టి సారించి భూముల కొనుగోలులో చూపిన ఆసక్తి అమరావతిని కట్టడంలో చూపించలేదని వివిధ పార్టీల నాయకులు, ప్రజలు సైతం ఆరోపణలు చేశారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ జగన్ సర్కారు అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో పరిపాలన సౌలభ్యం కోసం మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చింది.

విశాఖ, కర్నూలు, అమరావతిని రాజధానులుగా చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఈ ప్రక్రియ ప్రారంభం అయిన నేపథ్యంలో ప్రాధాన్యం కోల్పోయిన అమరావతి అభివృద్ధికి కేంద్రం జగన్ సర్కారుకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తాజాగా ప్రకటించిన కొత్త నగరాల పథకంలో 15వ ఆర్థిక సంఘం అమరావతి వంటి కొత్తగా అభివృద్ధి చెందుతున్న గ్రీన్ ఫీల్డ్ నగరాలకు వెయ్యికోట్ల చొప్పున గ్రాంట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో ఇప్పుడు అమరావతి కోసం జగన్ సర్కారు పోటీ పడుతుందా అని ఆసక్తికరంగా మారింది. కొత్త రాజధానిగా విశాఖను పరుగులు తీయిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అమరావతికోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
రాష్ట్ర విడిపోయి.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధానిగా ఏర్పడింది. నగర నిర్మాణం నత్తనడకన సాగింది. నిధుల కొరతతో పాటు చాలా సమస్యలు వచ్చాయి. ఇదే క్రమంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒకే చోట పరిపాలన సాధ్యంకాదని.. రాజధాని తరలింపునకు వ్యూహాలు సిద్ధం చేసింది. మూడు రాజధానులు ఏర్పాటుచేసి అమరావతి అభివృద్ధికి బ్రేకులు వేసింది. నిధుల కొరత, మూలన పడిన అమరావతి రాజధాని నిర్మాణాన్ని పట్టాలు ఎక్కించేందుకు వైసీపీ సర్కారు ముందుకు పడడం లేదు. ఈ క్రమంలో కేంద్ర సర్కారు అమరావతి వంటి నగరాలకు నిధులు ఇచ్చేందుకు ముందుకు రావడంతో స్థానికుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది.
కేంద్రం 15వ ఆర్థిక సంఘం ద్వారా వెయ్యికోట్లు గ్రాంట్ రూపంలో ఇప్పించే కొత్తప్రాజెక్టులో ఉండబోయే నగరాల ఎంపిక త్వరలో ప్రారంభం కానుంది. ఇందుకోసం కేంద్రం కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. నగరాల ఎంపికలో గ్రీన్ ఫీల్డ్ నగరం అమరావతి కూడా ఉంటుందా అనే అనుమానం కలుగుతోంది. ఇది కాదంటే.. విశాఖను ఏమైనా జగన్ సర్కారు ప్రతిపాదిస్తుందా అనే అనుమానం కలుగుతోంది. అమరావతిని ఎంపిక చేసేందుకు ప్రస్తుతం ఉన్న నిబంధనలు సరిగ్గా సరిపోతాయి. అదే విస్తరిస్తున్న విశాఖను కూడా పోటీలో నిలిపేందుకు అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే అభివృద్ధి చెంది ఉన్న విశాఖను జగన్ ప్రభుత్వం ప్రతిపాదిస్తుందా..? లేక నిధులు లేక పనులు మధ్యలో ఉన్న అభివృద్ధి చెందాల్సిన అమరావతిని ఎంపిక చేస్తుందా అన్నది వేచి చూడాల్సిందే..