Chandrababu- BJP: టీడీపీ విషయంలో బీజేపీ స్వరం మారుతోందా? మూడేళ్లుగా చంద్రబాబును దూరం పెట్టిన ఢిల్లీ పెద్దలు మెత్తబడ్డారా? ఇటు రాష్ట్ర బీజేపీ నాయకులు సైతం పసుపు దళాన్ని కలుపుకొని పోతే మేలనుకుంటున్నారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఈ అంశమే హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పట్టుమని 20 నెలల వ్యవధి కూడా లేదు. అన్ని రాజకీయ పక్షాలు దూకుడు పెంచుతున్నాయి. మరోవైపు పొత్తు అంశాలు తెరపైకి వచ్చినా క్లారిటీ మాత్రం లేదు. అయితే జనసేన, టీడీపీలు కలిసే వెళతాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే బీజేపీని కలుపుకొని వెళ్లాలని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి. అయితే బీజేపీ పెద్దలు మాత్రం ఇందుకు అంగీకరించడం లేదన్న వార్తలు వచ్చాయి. గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబుతో వెళ్లడానికి ఇష్టం లేదన్న టాక్ నడిచింది. అందుకే గత మూడేళ్లుగా చంద్రబాబును కేంద్ర పెద్దలు దూరం పెడుతూ వచ్చారు. అయితే ఉన్నట్టుండి చంద్రబాబుపై కేంద్ర పెద్దలకు సానుకూలత ఏర్పడింది. అడిగినా అపాయింట్ మెంట్ ఇవ్వకుండా ఇన్నాళ్లూ దూరం పెట్టిన కేంద్ర పెద్దలు వరుసగా ఆయనకు ఆహ్వానాలు పంపుతున్నారు. భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ నాటి నుంచి టీడీపీకి కేంద్ర పెద్దలు ఆహ్వానాలు పంపుతునే ఉన్నారు. తాజాగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న సన్నాహక కార్యక్రమం అజాదీ కా అమృత్ దినోత్సవ కార్యక్రమానికి చంద్రబాబుకు ఆహ్వానం అందడంతో ఆయన ఉబ్బితబ్బిబ్బయ్యారు. హస్తినాకు పయనమయ్యారు.

మూడేళ్ల తరువాత…
2019 ఎన్నికల వరకూ కాషాయదళానికి చంద్రబాబు నమ్మదగిన మిత్రుడు. అప్పటివరకూ పొత్తుతో ఉభయ పార్టీలు లాభపడ్డ సందర్భాలున్నాయి. అయితే విభజన హామీల విషయంలో తలెత్తిన విభేదాలతో చంద్రబాబు ఎన్డీఏ నుంచి దూరమయ్యారు. అటు కేంద్రం నుంచి టీడీపీ, రాష్ట్ర ప్రభుత్వ నుంచి బీజేపీ వైదొలిగాయి. రెండు పార్టీలు బద్ధ శత్రువులుగా మారాయి. వాస్తవానికి నాడు వైసీపీ ట్రాప్ లో పడి చంద్రబాబు రాజకీయంగా బీజేపీతో వైరం తెచ్చుకున్నారని విమర్శకులు సైతం అభిప్రాయపడ్డారు. అటు తరువాత రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితమివ్వడం లేదు. రాజకీయ అవసరాలకు వైసీపీ పనికొస్తుందే తప్ప రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి ఆ పార్టీ మోకాలడ్డుతోంది. అందుకే బీజేపీ పెద్దలు పునరాలోచనలో పడ్డారు. వైసీపీ కంటే టీడీపీ బెటర్ అన్న నిర్ణయానికి వచ్చారు. టీడీపీతో వెళితే అటు ఎంపీ స్థానాలు పెంచుకోవచ్చన్న ఆలోచన చేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణాలో టీడీపీ శ్రేణులు కలిసివస్తే అధికారం సునాయాసంగా దక్కించుకోవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా సెటిలర్స్ ఓట్లను చంద్రబాబు ద్వారా దక్కించుకోవచ్చన్న నిర్ణయానికి వచ్చారు. తెలంగాణలో దాదాపు 40 నియోజకవర్గాల్లో సెటిలర్స్ ఉన్నారు. వీరంతా టీడీపీ సానుభూతిపరులు. చంద్రబాబును అభిమానిస్తారు. ఈ లెక్కన చంద్రబాబును దరి చేర్చుకుంటే అటు ఏపీలో కొద్దో గొప్ప సీట్లు సాధించడంతో పాటు ఇటు తెలంగాణలో అధికారంలోకి రావొచ్చని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకే చంద్రబాబుకు స్నేహ హస్తం అందించారన్న టాక్ నడుస్తోంది.
వైసీపీతో గ్యాప్…
ఇటీవల వైసీపీ వ్యవహరిస్తున్న తీరు కేంద్ర పెద్దలకు మింగుడు పడడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నం కాబట్టి మొహమాటపు స్నేహాన్ని జగన్ కొనసాగిస్తున్నారన్న అనుమానం కేంద్ర పెద్దలకు ఉంది. రాష్ట్ర ప్రయోజనాలకు కాకుండా వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ పాకులాడుతుండడం వారికి విస్మయం గొలుపుతోంది. ఉచిత పథకాల మాటున రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని.. ఏదో రోజు కేంద్రానికి గుదిబండగా మారుతారని అనుమానిస్తున్నారు. అందుకే జగన్ కంటే పాలనా విషయంలో చంద్రబాబే బెటరన్న నిర్ణయానికి వచ్చారు. మరోవైపు ఏపీలో తన మిత్రుడైన పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి వెళ్లేందుకు దాదాపు నిర్ణయానికి వచ్చారు. దీంతో వెళితే వైసీపీతో వెళ్లాలి. లేకుంటే ఒంటరి పోరే శరణ్యం. ఒక వేళ ఒంటరి పోరాటం చేసినా ఒక్క సీటు గెలుచుకునే స్థితిలో లేరు. అందుకే పాత కాపు చంద్రబాబును మచ్చిక చేసుకోవాలన్న తుది నిర్ణయానికి వచ్చారు. అందుకే జగన్ సైతం మోదీ అధ్యక్షతన నిర్వహించే కార్యక్రమానికి డుమ్మా కొడుతున్నారు.

చంద్రబాబుపై సోము ప్రశంసలు
టీడీపీ విషయంలో కేంద్ర పెద్దల కంటే రాష్ట్ర నేతలే ఎక్కువగా వ్యతిరేకించారు. అటువంటిది రాష్ట్ర నాయకుల స్వరం కూడా మారుతోంది. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధికార వైసీపీ కంటే టీడీపీ మీదే ఎక్కువగా విమర్శలు చేసేవారు. ఏ అంశంఅయినా మాట్లాడేటప్పుడు చివరకు చంద్రబాబుపై ఆరోపణలు చేయనిదే వీర్రాజు ముగించేవారు కాదు. అటువంటి వీర్రాజు ఇటీవల సైలెంట్ అయ్యారు. విజయవాడలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. విజనరీ నాయకుడిగా అభివర్ణించారు. అందుకే నాడు రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.8,500 కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. జగన్ కు అంత సీన్ లేదని.. ఒక్క రాజధాని కట్టలేనివాడు.. మూడు రాజధానులు ఎలా కడతాడని ప్రశ్నించారు. మొత్తానికైతే చంద్రబాబుకు అనుకూల వాతావరణం కనిపించే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి.
Also Read:Vice Presidential Election 2022: నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక..గెలిచేదెవరు?

[…] […]
[…] […]
[…] […]