BJP Focus On Telangana: తెలంగాణపై బీజేపీ దండయాత్ర మొదలైంది. ఇప్పటికే బీజేపీ చేతుల్లో ఉన్న కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు చేజారుతున్న వేళ ఇప్పుడు కొత్త రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ అధిష్టానం డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలోనే కొరకరాని కొయ్యగా ఉన్న దక్షిణ భారత్ లో ఆశాదీపంగా కనిపిస్తున్న తెలంగాణపై కన్నేసింది. ఇక్కడ అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అందుకే ఎన్నడూ లేనంతగా తెలంగాణకు ప్రాధాన్యం ఇస్తోంది. 20 రోజుల వ్యవధిలో రాష్ట్రానికి ఇద్దరు అగ్ర నేతల రాకతో బీజేపీలో కొత్త జోష్ నెలకొంది. పార్టీకి భరోసా నింపడం.. అదికారమే లక్ష్యంగా ముందుకు తీసుకువచ్చేందుకు బీజేపీ అగ్రనాయకత్వం సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది.
-26న రాష్ట్రానికి ప్రధాని రాక
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 26న రాష్ట్రానికి రానున్నారు. ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయనే వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని రాక అత్యంత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు 20 రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలంతా రాష్ర్టానికి వస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది.ఇటీవలే బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా కేంద్రహోంమంత్రి అమిత్ షా వచ్చి బీజేపీకి కొత్త ఊపు తెచ్చారు. ఇప్పుడు మోడీ రాకతో అది మరింత పతాకస్థాయికి చేరనుంది.
Also Read: Prakash Raj: ప్రకాశ్ రాజ్ భవితవ్యం ఏమిటి?
-మోడీ పర్యటనకు టీ బీజేపీ నేతల అమిత ప్రాధాన్యం
మరోవైపు ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కసరత్తు ప్రారంభించారు. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర దిగ్విజయవంతం కావడంతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటనలు పెద్ద ఎత్తున సక్సెస్ కావడంతో రాష్ట్ర పార్టీ నాయకులు, శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. తాజాగా ప్రధాని రాష్ట్రానికి వస్తున్న సమాచారం అందడంతో బీజేపీ శ్రేణుల్లో మరింత జోష్ నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను కనివినీ ఎరగని రీతిలో దిగ్విజయవంతం చేసే దిశగా బండి సంజయ్ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా బేగంపేట ఎయిర్ పోర్టులో ప్రధానికి ఘన స్వాగతం పలికేలా బండి సంజయ్ ఏర్పాట్లు చేస్తున్నారు. జంట నగరాల్లో కనీవినీ ఎరగని రీతిలో ప్రధానికి స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేందుకు సిద్దమయ్యారు.
-బీజేపీ పాలిత రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చేరనుందనే సంకేతాలు
అగ్రనేతల రాకతో జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమనే సంకేతాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. పాదయాత్రతో ప్రజలకు చేరువైన బండి సంజయ్ ను కేంద్రంగా చేసుకొని బీజేపీ కార్యాచరణ రూపొందిస్తున్నారు. వచ్చేసారి అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. రెండు సార్లు గెలిచిన వ్యతిరేకత కేసీఆర్ పై ఉన్న నేపథ్యంలో దాన్ని క్యాష్ చేసుకొని గెలవాలని బీజేపీ స్కెచ్ గీస్తోంది. అందుకే కేసీఆర్ టార్గెట్ గానే రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయిందని.. బీజేపీదే అధికారం అన్నట్టుగా హైప్ క్రియేట్ చేస్తున్నారు. వ్యతిరేకత బాగా ఉండడంతో కేసీఆర్ కూడా డిఫెన్స్ లో పడేలా రాజకీయం చేస్తున్నారు. అందుకే బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, మోడీలు వచ్చి ఇక్కడి నేతలకు భరోసానిచ్చి.. తెలంగాణ ప్రజల దృష్టిలో బీజేపీకి పాజిటివ్ వేవ్ కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు.
-పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై కసరత్తు
రాబోయే రెండేళ్లలో తెలంగాణలో పార్టీ పరంగా చేపట్టాల్సిన కీలక కార్యక్రమాలపై తెలంగాణబీజేపీ కసరత్తు ప్రారంభించింది. కేసీఆర్ ను ఓడించడానికి ప్రధాన అస్త్రాలుగా యువతను వాడుకోవాలని డిసైడ్ అయ్యింది. కేసీఆర్ నెరవేర్చని ఏకైక హామీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం.. దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్లి యువత వారధిగా కేసీఆర్ సర్కార్ ను కూల్చడానికి ఎత్తుగడులు వేస్తోంది. కేసీఆర్ చర్యలతో అసంతృప్తిగా ఉన్న నిరుద్యోగులు, ఉద్యోగులు, ఇతర రంగాల వారిని బీజేపీ వైపు తిప్పుకునే కార్యాచరణను బీజేపీ చేస్తోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరించి ఆయన కోటనుకూల్చే వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా కమిటీలు వేస్తోంది. ఇలా కేసీఆర్ ను ఓడించడమే ధ్యేయంగా కదులుతోంది. కేసీఆర్ ను రాష్ట్రంలో ఓడిస్తే ఆయన జాతీయ రాజకీయాలు చేయలేడు. ఈక్రమంలోనే తమకు పోటీగా రాలేడు. అదే వ్యూహంతో ముందుకు సాగడానికి బీజేపీ ప్లాన్ రెడీ చేసినట్లు సమాచారం.
Also Read:Director Nag Ashwin: అమితాబ్ పార్ట్ పూర్తి కానుంది.. ఇక ప్రభాస్ పార్టే బ్యాలెన్స్
Recommended Videos