Karnataka Election 2023: ప్రయోగాలు చేస్తాడు కాబట్టే రాజమౌళి సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతుంటాయి. సినిమాలకే కాదు రాజకీయాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఇప్పుడు ఈ ప్రయోగాన్ని భారతీయ జనతా పార్టీ త్వరలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగించింది. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటక శాసనసభలో దాదాపు కొత్త ముఖాలకే టికెట్లు ఇచ్చింది. దీంతో సీనియర్లు భగ్గుమంటున్నారు. మొన్నటిదాకా మంత్రి పదవులు అనుభవించిన వారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలనే యోచనతో ఉన్న భారతీయ జనతా పార్టీ గట్టి ప్రణాళికలు రూపొందించుకుంటున్నది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే అభ్యర్థులను అత్యంత పకడ్బందీ ప్రణాళికతో ఎంపిక చేసింది. అమెరికన్ అధ్యక్ష విధానాల్లో ఎలాంటి పారదర్శకత పాటిస్తారో.. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ అదే విధానాన్ని అనుసరించింది. ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున అభ్యర్థులను నియమిస్తూ ఇక్కడి రాష్ట్ర అధినాయకత్వం ఢిల్లీలోని అధిష్టానానికి పంపించింది. అక్కడి అధిష్టానం కేవలం గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇస్తూ నిర్ణయం తీసుకొని, సీల్డ్ కవర్లో అభ్యర్థుల జాబితా ప్రకటించింది.
ఇప్పుడు కన్నడ సీమలో బిజెపి తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే మరికొద్ది నెలలో తెలంగాణలో ఎన్నికలు, మరో ఏడాదిలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇక్కడి కాంగ్రెస్, వైఎస్ఆర్సిపి, టిడిపి, భారత రాష్ట్ర సమితి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.
2019లో జరిగిన ఎన్నికల్లో టిడిపి ప్రయోగాలకు పెద్దపీట వేయలేదు. గతంలో పాతుకుపోయిన నేతలకే టికెట్లు ఇచ్చింది. దాని ఫలితాన్ని అనుభవించింది. పార్టీ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు చవిచూడని ఓటమిని పొందింది. మరి ఈసారైనా వృద్ధ నాయకులను వదిలిపెట్టి, యువ రక్తానికి చోటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇక వైఎస్ఆర్సిపి విషయానికి వస్తే జగన్ ఎవరి మాట వినడు. గెలిచే వారికి మాత్రమే టికెట్లు ఇస్తాడు. ప్రశాంత్ కిషోర్ నివేదిక ఆధారంగా జగన్ గత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చాడు. అందుకు తగ్గట్టుగానే ఫలితం వచ్చింది. ఈసారి కూడా ప్రశాంత్ కిషోర్ టీం చేసిన సర్వే ఆధారంగానే టికెట్లు ఇస్తామని జగన్ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశాడు. అయితే జగన్ మాటలు ద్వారా తమకు టికెట్లు రావని భావించిన కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిరసన గళం వినిపిస్తున్నారు. అయినప్పటికీ జగన్ తన దారిలోనే వెళ్తున్నాడు.
ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి బలంగానే ఉంది. కానీ దాని నాయకత్వమే ప్రధాన అవరోధంగా ఉంది. పార్టీలో యువ రక్తాన్ని నింపేందుకు రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నప్పటికీ వృద్ధ తరం నాయకులు అడ్డుపడుతున్నారు. దీనివల్ల పార్టీ జనాల్లో చులకన అవుతోంది. ఫలితంగా గెలిచే అవకాశాలు ఉన్నచోట చేజేతులా ఓటమిని తెచ్చుకుంటున్నది. ముఖ్యంగా నాయకుల్లో ఓ వర్గం కెసిఆర్ కు కోవర్టులుగా పని పని చేస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ ఎదగడం లేదు. మరి ఈసారైనా యువ రక్తానికి చోటిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భారత రాష్ట్ర సమితి తెలంగాణలో బలంగా ఉంది. సెట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఈసారి ప్రయోగాలకు పెద్దగా అవకాశం ఉండదని తెలుస్తోంది. అలాగని చెప్పి ప్రజల్లో ఆదరణ లేని వారికి టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని భారత రాష్ట్ర సమితి నాయకులు చెప్తున్నారు. అలాంటప్పుడు కొత్త తరాన్ని ప్రోత్సహిస్తారా, లేక అలవాటైన తీరుగా పాతతరం నాయకులకే టికెట్లు ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే భారత రాష్ట్ర సమితిని విస్తరించాలనే ఆలోచనతో ఉన్న కేసీఆర్ ఈసారి యువనాయకత్వానికి ఎక్కువ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలంగాణలో ఉన్న బిజెపికి టికెట్లు ఇచ్చే అధికారం లేదు కాబట్టి, ఆ బాధ్యతను పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది. ఒకవేళ బిజెపి కర్ణాటక లో పాటించిన విధానం విజయవంతం అయితే కనుక దక్షిణాదిలోనూ మిగతా పార్టీలు అదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉంది.