
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరోసారి విభజన అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు పలు దఫాలుగా వినిపించిన ఈ డిమాండ్ ను.. తాజాగా బీజేపీ నేతలు ఎత్తుకున్నారు. ఉత్తర బెంగాల్ లోని అలీపుర్దూర్, జల్పాయ్ గురిచ కుచ్ బెహార్, డార్జిలింగ్, మాల్దా, ఉత్తర దీనాజ్ పూర్, దక్షిణ దీనాజ్ పూర్, కాలిపాంగ్ జిల్లాలతో కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కోరుతున్నారు. ఉత్తర బెంగాల్ వెనకబడిందని, అందువల్ల యూటీ చేస్తే.. అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. అలీపుర్దూర్ ఎంపీ జాన్ బార్లా, జల్పాయ్ గురి పార్లమెంటు సభ్యుడు జయంత్ రాయ్ తదితరులు ఈ డిమాండ్ చేశారు.
అయితే.. బెంగాల్ విభజన డిమాండ్ ఈ నాటిది కాదు. 1980ల్లోనే గూర్ఖాలాండ్ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన సుభాష్ ఘీషింగ్ మరణం తర్వాత తీవ్రత తగ్గింది. అయితే.. అప్పటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసేందుకే కేంద్రం ఈ ఉద్యమాన్ని వెనకుండి నడిపించిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. తర్వాత కాలంలో ప్రత్యేక కామత్ పూర్ పేరుతో ఆందోళన సాగింది. మరోసారి గ్రేటర్ కుచ్ బెహార్ ఏర్పాటు చేయాలంటూ పోరాటం సాగించారు. అంతేకాదు.. ఉత్తర బెంగాల్ తోపాటు అసోంలోని కొన్ని జిల్లాలు కలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కూడా కొందరు ఉద్యమించారు. ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం డిమాండ్ లేవనెత్తారు బీజేపీ నేతలు.
దీనిపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఓడిపోయిన అక్కసును కేంద్రంలోని బీజేపీ ఈ విధంగా తీర్చుకుంటోందని దుయ్యబట్టారు. ఇది బెంగాల్ ను విభజించేందుకు కాషాయ పార్టీ చేస్తున్న కుట్రగా చెప్పారు. కేంద్రం మద్దతుతోనే ఈ డిమాండ్ తెరపైకి వచ్చిందని అన్నారు. తాను ప్రాణాలతో ఉన్నంత వరకు ఇది జరగదని తేల్చి చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సైతం కేంద్ర పాలిత ప్రాంతం డిమాండ్ ను ఖండించడం గమనార్హం.
మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ ప్రభావం చూపించింది. మొత్తం 54 స్థానాలు ఉన్న ఉత్తర బెంగాల్ లో బీజేపీ 31 స్థానాలు గెలుచుకుంది. తృణమూల్ కాంగ్రెస్ 22 సీట్లను మాత్రమే దక్కించుకుంది. మిగిలిన ఒకటి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ ప్రాంతంలో తమ పట్టుందని మమతను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అనే చర్చ కూడా సాగుతోంది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కాకుండా.. కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరడాన్ని కూడా ఇందుకు కారణంగా చూపుతున్నారు. మరి, ఇదొక ప్రకటన లాంటిదా? నిజంగానే ఉద్యమిస్తారా? బెంగాల్ విభజన అంశం రాష్ట్ర రాజకీయాలను ఏ మలుపు తిప్పనుంది? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.