CM Jagan Vs BJP : జగన్ సర్కారుపై బీజేపీ చార్జిషీట్.. వర్కవుట్ అవుతుందా?

చార్జిషీట్లు అంటూ హడావుడి చేసినా బీజేపీ నేతలను ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? అంటే అదీ లేదు. ఈ ప్రయత్నం ఏదో ఏడాది ముందు చేసి ఉంటే కొంత నమ్మకం ఉండేది.

Written By: Dharma, Updated On : April 29, 2023 2:36 pm
Follow us on

CM Jagan Vs BJP : ఏపీలో బీజేపీకి క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. దానిని నుంచి బయటపడేందుకు మల్లగుల్లాలు పడుతోంది. వైసీపీకి అనుకూలం కాదని నిరూపించుకునేందుకు తంటాలు పడుతోంది. గత ఎన్నికల అనంతరం వైసీపీతో బీజేపీ స్నేహం ప్రారంభమైంది. అయితే అది ఇప్పుడు ముదిరిపాకాన పడింది. చివరకు తమకు వైసీపీతో అస్సలు సంబంధాలు లేవనే స్టేజ్ కు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం జనసేన బీజేపీకి మిత్రపక్షం. కానీ అంతకు మించి వైసీపీ అన్న ఆరోపణలు చుట్టుముట్టాయి. దీనికి పరిస్థితులే కారణమయ్యాయి. కానీ ఆ ఆరోపణల నుంచి బయటపడేందుకు బీజేపీ తంటాలు పడుతోంది. తాజాగా సమస్యలు, అవినీతిపై చార్జిషీట్ లంటూ హడావుడి ప్రారంభించింది. కార్యక్రమాల నిర్వహణకు కసరత్తు చేస్తోంది. ఈ చార్జిషీట్లకుగానే హైకమాండ్ నలుగురు నాయకులతో కూడిన కమిటీని నియమించింది.

లక్కీ చాన్స్..
గత ఎన్నికల ముందు జరిగిన ఎపిసోడ్ తో జగన్ బీజేపీకి దగ్గరయ్యారు. వైసీపీ ట్రాప్ లో పడి చంద్రబాబు ఎన్డీఏకు దూరమయ్యారు. బయటకు వెళుతూ వెళుతూ ప్రధాని మోదీకి రాజకీయ శత్రువుగా మారారు. శత్రువుకు శత్రువు మిత్రుడన్న మాదిరిగా జగన్ మోదీకి దగ్గరయ్యారు. టీడీపీ లోటును తన వైసీపీతో భర్తీ చేసుకున్నారు. అప్పటి నుంచి అయినదానికి కానిదానికి వైసీపీ, బీజేపీల మధ్య పరస్పర సహకారం అందించుకోవడంతో స్నేహం మరింత బలపడింది. ఏపీలో సంఖ్యాపరంగా మంచి విజయమే దక్కించుకున్నా.. అదే స్థాయిలో కేంద్రంలో బీజేపీకి కూడా మెజార్టీ దక్కడంతో జగన్ కాస్తా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. బహుశా ఈ కారణంతోనే రాష్ట్రానికి రావాల్సిన కీలక ప్రాజెక్టుల విషయంలో జగన్ రాజీపడ్డారన్న అపవాదు ఎదురైంది.

జగన్ వ్యూహాత్మకం..
అయితే తనపై ఉన్న కేసులు ఒకవైపు, చంద్రబాబు మరోసారి బీజేపీ వైపు వెళ్లకుండా చేసేందుకు జగన్ వ్యూహాత్మకంగా మౌనం ప్రదర్శిస్తూ వచ్చారు. ఎక్కడా బీజేపీపై వ్యతిరేకత కనబరచలేదు. అయితే ఇది అంతిమంగా బీజేపీకి నష్టం చేసింది. ప్రతీసారి ఢిల్లీ టూర్లు వెళ్లినప్పుడు అప్యాయపలకరింతలు, అక్కున చేర్చుకోవడాలు చేస్తున్నా ప్రాజెక్టులకు మోక్షం కలగలేదు. నేను అడుగుతున్నా కేంద్రం ఇవ్వడం లేదన్న రీతిలో జగన్ వ్యవహరిస్తున్నారు. దీంతో ఏపీ ప్రజల ముంగిట బీజేపీ విలన్ గా మారింది. అటు ఎన్నికల ముందు చంద్రబాబు వ్యూహాత్మకంగా దెబ్బకొట్టారు. ఇప్పుడు బీజేపీకి నొప్పి తెలియకుండా జగన్ సైతం దెబ్బేస్తున్నారు.

ప్రజలు నమ్ముతారా?
అయితే జగన్ వైఖరి తెలియకో.. లేకుంటే కేసుల భయం చూపి సొమ్ముచేసుకుంటూ నాలుగేళ్లుగా బేషరతుగా వైసీపీ మద్దతు తీసుకున్న బీజేపీ.. ఇప్పుడు ఎన్నికల ముందు తమను తాము నిరూపించుకోవాల్సిన పరిస్ధితి వచ్చేసింది. అందుకే వైసీపీపై చిన్నపాటి యుద్ధాన్ని ప్రారంభించింది. పీ బీజేపీ నేతలు తాజాగా వైసీపీ పాలనపై ఛార్జిషీట్లు విడుదల చేస్తామని, వైసీపీ ప్రభుత్వ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్ధలకు ఫిర్యాదులు చేస్తామని హెచ్చరికలు ప్రారంభించారు. అయినా వైసీపీ ఏమీ చేయలేని పరిస్ధితి. అయితే చార్జిషీట్లు అంటూ హడావుడి చేసినా బీజేపీ నేతలను ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? అంటే అదీ లేదు. ఈ ప్రయత్నం ఏదో ఏడాది ముందు చేసి ఉంటే కొంత నమ్మకం ఉండేది. కానీ ఇంత జరిగాక ప్రజలు పోరాటాన్ని గుర్తిస్తారనుకుంటే అది భ్రమేనని రాజకీయ విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు.