https://oktelugu.com/

Employees Ultimatum : సమరానికి సై.. ఏపీ సర్కారుకు ఉద్యోగుల అల్టిమేటం

50 రోజులుగా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మూడో దశ ఉద్యమాన్ని ప్రకటిస్తామని తెలిపారు.

Written By:
  • Dharma
  • , Updated On : April 29, 2023 / 02:14 PM IST
    Follow us on

    Employees Ultimatum : జగన్ సర్కారుతో అమీతుమీకి ఉద్యోగులు సిద్ధమయ్యారా? మరో ఉద్యమం దిశగా అడుగులేస్తున్నారా? ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇదే మంచి తరుణంగా భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఏకతాటిపైకి వచ్చిన ట్రేడ్ యూనియన్ నేతలంతా ఐక్య తీర్మానం చేశారు. ప్రభుత్వంపై పోరాటానికే మొగ్గుచూపుతున్నారు. ప్రధానంగా ఉద్యోగులపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని డిసైడయ్యారు. ప్రజా సహకారంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. ఉద్యోగుల సమస్యలపై ఏపీజేఏసీ అమరావతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఉద్యమం వైపే మొగ్గుచూపాయి. సరైన సమయంలో ఆందోళన బాట పట్టి.. ప్రభుత్వానికి కనువిప్పు కలిగిద్దామని నిర్ణయానికి వచ్చాయి.

    దుష్ప్రచారం తగదు..
    ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోగా.. గోబెల్స్ ప్రచారం చేయడంపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం రూ.90 వేల కోట్లు ఖర్చుచేస్తున్నామన్న ప్రభుత్వ ప్రకటన సమావేశంలో చర్చకు వచ్చింది. దీనిపై ఉద్యోగ సంఘ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సలహాదారులు, వలంటీర్ల వేతనాలు ఉద్యోగుల ఖాతాల్లో చేర్చడం ఏమిటని ప్రశ్నించారు. ఇది తప్పుడు ప్రచారంగా కొట్టిపారేశారు. పార్టీకి సేవలందిస్తున్న సలహాదారుల జీతాలు ఉద్యోగులతో కలపడం ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. యంత్రాంగంతో వారికి ముడిపెట్టడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరు మారకుంటే ఉద్యమం శరణ్యమని తేల్చిచెప్పారు. అందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

    నేతల ఫైర్…
    ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వేంకటేశ్వర్లు , ఏపీ ఎన్జీఏ సంఘం ప్రధాన కార్యదర్శి శివారెడ్డి ప్రభుత్వ తీరును తప్పపట్టారు. ఉద్యోగులపై ఎందుకీ కక్ష అని ప్రశ్నించారు. . 30 ఏళ్లు పని చేసిన ఉద్యోగికి పెన్షన్ అవసరం లేదా అని ప్రశ్నించారు. తక్షణం సీపీఎస్ ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. త్వరలోనే తమ సంఘంలో చర్చించి ఉద్యమంలోకి వచ్చే అంశం ప్రకటిస్తామని ఏపీ ఎన్జీవో సంఘం నేతలు ప్రకటించారు. సంక్రాంతికి ఇస్తామని డీఏ ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. 16 డిమాండ్ల పై మినిట్స్ రికార్డు చేయించారని గుర్తు చేసారు. అందులో అయిదేళ్లకు ఒకసారి పీఆర్సీ ఇస్తామన్నారని చెప్పారు. ఇప్పుడు అది అమలు అవుతుందా అనే సందేహం మొదలైందని ఏపీ ఎన్టీఓ సంఘ నేతలు అనుమానం వ్యక్తం చేసారు.

    త్వరలో కార్యాచరణ..
    సమావేశంలో ఉద్యోగ సంఘ నాయకులు కీలక అడుగులు వేశారు. గత 50 రోజులుగా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మూడో దశ ఉద్యమాన్ని ప్రకటిస్తామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పైన ధర్నాచేయడానికి డిసైడ్ అయ్యారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మే 3న చేసే రాస్తారోకోకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యమానికి కలిసి వస్తామని కార్మిక సంఘాల నేతలు ఉద్యోగ నేతలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం మెడలు వంచే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. ఇటు ప్రభుత్వం మే 1వ తేదీ నుంచి ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో భాగంగా వరుసగా జీవోలు జారీ చేస్తామని వెల్లడించిది. కానీ ఆచరణలో ఎంతవరకు అమలుచేస్తారో చూడాలి మరీ.