Arvind Dharmapuri: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరోవైపు ఎన్నికల కౌంట్‌డౌన్ మొదలు కావడంతో అభ్యర్థులు తమను, తమ పార్టీని గెలిపించేందుకు ప్రత్యర్థి పార్టీలపై మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా, బీజేపీ ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాన్నా సీఎం కేసీఆర్ చాలా బెటర్ అని వ్యాఖ్యలు చేశారు.
శత్రువుకు శ్రతువు.. మిత్రుడన్నట్లు..
అర్వింద్ వ్యాఖ్యలు చూస్తుంటే శత్రువుకు శ్రతువు.. మిత్రుడన్నట్లు.. ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం బీఆర్‌ఎస్, బీజేపీలు కాంగ్రెస్‌ను శత్రువుగా భావిస్తున్నాయి. రెండు పార్టీలూ కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. తాజాగా అర్వింద్ కూడా రేవంత్ కన్నా.. సీఎం కేసీఆరే నయమని మాట్లాడడం ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు.
తెలంగాణకు వ్యతిరేకంగా..
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో అర్వింద్ శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నార్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ కంటే కేసీఆర్ మేలు అన్నారు. సీఎం కేసీఆర్ పదేళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడారని, కేసీఆర్ కొట్లాడేటప్పుడు రేవంత్‌రెడ్డి తెలుగుదేశంలో ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశాడని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు సంబంధించిన నాయకులంతా ఇప్పుడు కాంగ్రెస్‌లోనే ఉన్నారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే టీడీపీకి వేసినట్లే..
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. బీఆర్‌ఎస్‌కు వేసినట్లే అని బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. అర్వింద్ మాత్రం ఓ అడుగు ముందుకేసి, తెలంగాణ సెంటిమెంటును రగిల్చేలా ఈసారి కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం చేతిలో పెట్టినట్లే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌డ్డి తెలంగాణను హోల్ సేల్‌గా అమ్మేస్తాడని ఆరోపించారు. చంద్రబాబు కోసం సంచులను మోసుకెళ్లాడు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 2018 ఎన్నికల్లో హైదరాబాద్ నేనే కట్టానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా బీజేపీ-బీఆర్‌ఎస్ మధ్య రహస్య మైత్రి కొనసాగుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం ఒక్కటే అని ప్రచారం చేస్తోంది. తాజాగా రైతుబంధు డబ్బుల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు రెండు రోజుల ముందు వరకు అనుమతి ఇవ్వడమే బీజేపీ-బీఆర్‌ఎస్ మైత్రికి నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.