త్వరలో జరగబోయే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన ప్రభావాన్ని ఎలా చూపాలని భావిస్తోంది. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా వైఫల్యాలు పార్టీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయి. దీంతో పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు వ్యూహాలు సిద్ధం చేసేందుకు పని ప్రారంభించింది. వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఎన్నికల కోసం బీజేపీ-ఆర్ఎస్ఎస్ భేటీలో మేథోమథనం జరిపాయి. కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో పార్టీని ఒడ్డుకు చేర్చడం కష్టసాధ్యమేనని అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్ నదుల్లో వందలాది మృతదేహాలు కొట్టుకువస్తున్న సంఘటనపై కూడా చర్చ జరిగింది. మోదీ హవా కొనసాగాలంటే ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై పలు రకాల చర్చలు వచ్చాయి.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పరాభవం సాధించింది. పార్టీ బలపరచిన అభ్యర్థులు భారీ సంఖ్యలో ఓడిపోవడం పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. దీని ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై కూడా పడుతుందని విశ్లేషిస్తున్నారు. బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ అవలంబించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేశారు. సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు దత్తాత్రేయ హోసబాలే తదితరులు హాజరయ్యారు.
ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై విమర్శలు పెరుగుతున్నాయి. సొంత పార్టీ వారే ఎత్తిచూపడం పరిపాటిగా మారింది. కరోనా విలయతాండవం చేస్తున్నా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఆరోగ్య కేంద్రాలకు వెళ్లిన కేసులను తిరిగి పంపిస్తున్నారని వాపోతున్నారు. ఐసీయూలో బెడ్ల కొరత ఉందని సీతాపూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రాథోడ్ చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. దీంతో యూపీలో గెలుపు వ్యూహంపై దృష్టి పెట్టాల్సిన అవసరంపై చర్చించారు.
ఉత్తరప్రదేశ్ లోని గంగా నదిలో శవాలు కొట్టుకొస్తుండడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా తో చనిపోయిన వారందరిని ఇసుకలో పాతేస్తున్నారని తెలిపారు. దీంతో అవి వరద తాకిడికి మరో ప్రాంతానికి కొట్టుకురావడంపై అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ప్రయాగ్ రాజ్ జిల్లా దేవరఖ్ ఘాట్ వద్ద ఇసుకలో వందల మృతదేహాలు బయటపడ్డాయి. శ్మశాన వాటికలు ఖాళీ లేకపోవడంతో అంత్యక్రియల ఖర్చు పెరగడం వల్ల నది ఒడ్డునే ఇసుకలో పూడ్చి పె డుతున్నారని స్థానికులు తెలిపారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. శవాలను పూడ్చిపెట్టడాన్ని నిషేధించినా కోవిడ్ కల్లోలంతో పరిస్థితి ఇంత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు.