BJP: దేశంలో మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది. వస్తామని ధీమాతో కూడా ఉంది. ప్రతిపక్షం బలహీనంగా ఉండడంతో కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థలు కూడా చెబుతున్నాయి. ఇంత వరకు ఓకే.. అయితే బీజేపీ ఈసారి 370 నంబర్‌ను సెలక్ట్ చేసుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 370 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ 370 వెనుక బీజేపీ పెద్ద ప్లానే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎందుకీ 370…
పొలిటికల్ ఎనలిస్టుల అభిప్రాయం ప్రకారం.. 370 అనేది ప్రత్యేక మెజారిటీ నంబర్. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ కూడా చివరి లోక్‌సభ సమావేశాల్లో భారతీయ జనతాపార్టీ మళ్లీ 370 సీట్లతో అధికారంలోకి వస్తుందని ప్రకటించారు. అయితే ఇదేదో ఊరికే చేసిన ప్రకటన కాదంటున్నారు విశ్లేషకులు. లోక్‌సభలో మొత్తం సీట్లు 545. ఇందులో మూడో వంతు అంటే 363.
రాజ్యాంగం ఏం చెబుతుంది..
ఇక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం.. మొత్తం సీట్లలో మూడో వంతు అంటే 363 లేదా అంతకన్నా ఎక్కువ సీట్లు ఉంటే.. ఆ పార్టీకి రాజ్యాంగంలోని ఏదైనా ఆర్టికల్‌ను మార్చే, తొలగించే, సవరించే అధికారం వస్తుంది. అందుకే బీజేపీ ఈసారి టార్గెట్ 370 నినాదంతో ముందుకు సాగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
370 సాధిస్తే ఏం జరుగుతుంది..
ఇక బీజేపీ వచ్చే ఎన్నికల్లో 370 సీట్లు గెలిస్తే కచ్చితంగా చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజ్యాంగంలో కూడా మార్పులు చేస్తుందని అంటున్నారు. కొన్ని సవరణలు కూడా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా హిందూ దేశంగా ప్రకటించే అంశంతోపాటు రిజర్వేషన్లు రద్దు అవుతాయన్న చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. 303 సీట్లు మెజారిటీతోనే బీజేపీ జమ్ముకశ్మీర్‌లో ఆర్టిక్ 370ని రద్దు చేసింది. ఈసారి 370 సీట్లు వస్తే అనేక మార్పులు ఖాయమని అంటున్నారు.
ప్రజాస్వామ్య వాదుల్లో ఆందోళన..
కేంద్రంలో చాలా ఏళ్ల తర్వాత బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 2024 పార్లమెంటు ఎన్నికల్లోనూ సింగిల్‌గా అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అదే జరిగితే ప్రజాస్వామ్యానికే ముప్పు అని విపక్షాలతోపాటు ప్రజాస్వామ్య వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంతోపాటు ప్రతిపక్షం బలంగా ఉంటేనే పాలకులు పనులు చేస్తారని అంటున్నారు. అలా కాకుండా ఏకపక్షంగా అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని పేర్కొంటున్నారు.