
బీజేపీ రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో అనుసరిస్తున్న విధానాలకు పొంతన కుదరడం లేదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండారంటారు. అదేవిధంగా అధికార దాహానికి విలువలు, సిద్ధాంతాలు అవసరం లేదనేది ఇప్పుడు పార్టీ బాగా అలవాటు చేసుకున్నాయి. ఏ స్థాయిలో ఎవరితో అవసరం ఉంటే వారితో అంటకాగుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు మించి సీట్లు సాధించి అధికారం చేపట్టింది. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు సాధించి అధికారం చేపట్టింది. 23 ఎంపీ స్థానాలు సాధించింది.
కొద్ది నెలల కిందట బీజేపీ సినీనటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంది. రెండు పార్టీలు ప్రజా సమస్యలపై పోరాటానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికార పార్టీ చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను బీజేపీ రాష్ట్ర పార్టీ నాయకులు ఎండగడుతున్నారు. జాతీయ స్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ పరిస్థితి బీజేపీ, వైసీపీ పొత్తు పెట్టుకున్నట్లుగా ఉన్నాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పనులకు జాతీయ స్థాయిలో బీజేపీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా మద్దతు పలుకుతున్నాయి. ఈ విధానం రాష్ట్రంలోని ఆ పార్టీ నాయకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చేసేదేమీలేక మిన్నకుండి పోతున్నారు.
రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకులు కొంత కాలంగా రైతుల దీక్షకు మద్దతు తెలిపి, కేంద్రం జోక్యం చేసుకుంటోందని ప్రకటించినా ఇంతవరకూ కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ఐఏఎస్ లు, ఐపీఎస్ ల సస్పెన్షన్ల పేరుతో కక్ష సాధింపు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి పరోక్షంగా సహకరించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను మార్చడంలోను ఇదే జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనలపై ఇక్కడి బీజేపీ నాయకులు మాత్రం తప్పు పడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు.
రాష్ట్రంలో బీజేపీ, జనసేనకు ఉమ్మడి ప్రత్యర్థిగా వైసీపీపై అస్త్రాలు ఎక్కు పెడుతుంటే జాతీయ స్థాయిలో బీజేపీ వ్యవహార శైలి సమస్యగా మారింది. గత ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ సహకరించాడు. పవన్ జనసేన పార్టీని స్థాపించిన అనంతరం జాతీయ స్థాయిలో బీజేపీ నేతలు పవన్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇది ఏమైనా బీజేపీ జాతీయ, రాష్ట్ర స్థాయిలో వ్యవహరిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలు తప్పుబడుతున్నారు.