
ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నిక జరిగి తీరేలానే కనిపిస్తోంది. ఇవాళ, రేపటిలోగా ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించి, ఏం చేయాలనే విషయమై సమాలోచనలు చేయనున్నారనే ప్రచారం జరిగింది. ఈ భేటీలో ఎగ్జిక్యూటివ్ సభ్యులు, ‘మా’ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కృష్ణం రాజు కూడా పాల్గొంటారని సమాచారం. వర్చువల్ గా నిర్వహించనున్న ఈ భేటీలో.. ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారని కూడా తెలుస్తోంది. అయితే.. మెగాస్టార్ తో సహా పలువురు ఇండస్ట్రీ పెద్దలు ఈ సారి ఎన్నిక ఏకగ్రీవం చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు. కానీ.. పోటీ దారులు పడనీయట్లేదని సమాచారం.
ఇప్పటికే ప్రకాష్ రాజ్ ప్యానల్ ప్రకటించగా.. మంచు విష్ణు, హేమ, జీవిత, జీవీఎల్ వంటి వారు తాము అధ్యక్ష బరిలో ఉన్నామని అనౌన్స్ చేసుకున్నారు. అయితే.. వీరిలో ప్రధాన పోటీ ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు మధ్యనే ఉంటుందనే ప్రచారం సాగుతోంది. అయితే.. సినీ పెద్దలు ఎన్నిక ఏకగ్రీవం చేయాలని చూస్తుండగా.. పోటీదారులు మాత్రం వెనక్కి తగ్గేది లేదని అంటున్నారట. అంతేకాదు.. ఇప్పటికే అనధికారికంగా ప్రచారం కూడా మొదలు పెట్టేశారని చెబుతున్నారు.
ప్రధానంగా ప్రకాష్ రాజ్, విష్ణు తమ విజయానికి అవసరమైన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవట్లేదు. ఇప్పటికే ఒక అభ్యర్థి మా సంస్థకు చెందిన సభ్యులను గ్రూపులుగా కలుస్తున్నారట. ఒక్కో గ్రూపును ఒక్కో చోట మీట్ అవుతున్నారట. వారికి చిన్న చిన్న పార్టీలు కూడా ఏర్పాటు చేస్తున్నారని టాక్. అంతేకాకుండా.. కొందరు నిరుపేద సభ్యుల అకౌంట్లలో డబ్బులు కూడా వేస్తున్నారట. ఈ డబ్బులు ఎందుకు అని అడిగితే.. ‘కరోనా టైమ్ కదా.. ఉంచండి’ అంటూ కవర్ చేస్తున్నారట.
ఈ విధంగా.. అప్పుడే మా ఎన్నికల పోరాటం మొదలైందని అంటున్నారు. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరులో ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా థర్డ్ వేవ్ అనేది లేకపోతే.. ఆ నెలలోనే ఎన్నిక జరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే.. సినీ పెద్దలు మాత్రం పిలిచి మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. మరి, ఏం జరుగుతుంది? ఏకగ్రీవమా? ఎన్నికా? అన్నది చూడాలి.