Bihar Assembly Elections: బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తీసుకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నీతీష్ కుమార్ పాలసీలు, కుల ఓటు బ్యాంకులు, తటస్థ ఓటర్ల ప్రవృత్తి ఈ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. గత సర్వేల్లో మహాఘట్‌బంధన్‌కు విజయావకాశం ఉన్నట్లు ఒపీనియన్ పోల్స్ వచ్చినా.. ఇటీవలి మార్పులు ఎన్‌డీఏకు అనుకూలంగా మారుతున్నాయి.
రెండు విడతల్లో పోలింగ్..
బిహార్‌లో నవంబర్ 6న మొదటి దశలో 18 జిల్లాల్లోని 108 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఇందులో ఉత్తర, మధ్య, పశ్చిమ, దక్షిణ బిహార్‌లోని కొన్ని ముఖ్య నియోజకవర్గాలు చేరుతాయి. దర్భంగా, ఆరా, బిహార్‌షరీఫ్, నలంద, బక్సర్, చాప్రా, పట్నా వంటి ప్రాంతాలు ఇక్కడ భాగస్వామి. ఈ జిల్లాలు బీజేపీ, జేడీయూ కలిసి బలమైన పట్టు కలిగిన ప్రదేశాలుగా పరిగణించబడతాయి. రెండో దశలో, నవంబర్ 11న 20 జిల్లాల్లోని 120 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. రక్సాల్, సుపౌల్, కటిహార్, కిషన్‌గంజ్, పూర్ణియా వంటి సరిహద్దు జిల్లాలు ఇక్కడ ప్రధానంగా ఉంటాయి, ఇవి ముస్లిం జనాభా ఆధిక్యత కలిగిన ప్రాంతాలు. మొత్తంగా రెండు విడతల్లో 7.42 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. ఈ విభజన ప్రథమ దశలో ఎన్‌డీఏకు అనుకూలంగా, రెండో దశలో మహాఘట్‌బంధన్‌కు అవకాశాలు కల్పిస్తుందని విశ్లేషకులు అంచనా.
కూటముల కసరత్తు షురూ..
బిహార్‌లో రెండు కూటములు ప్రధానంగా ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్‌డీఏ (బీజేపీ–జేడీయూ), ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ (ఆర్‌జేడీ–కాంగ్రెస్). ఈ కూటముల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అంచనా. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక, సీటు పంపిణీలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ కసరత్తు కూటముల మధ్య సమతుల్యతను పరీక్షిస్తుంది. ఎల్‌జేపీ విభజన, ఈ ప్రక్రియను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఫలితంగా, చిన్న పార్టీలు ఓట్లను చీల్చే అవకాశం పెరిగింది.
మారుతున్న సమీకరణాలు..
ప్రీ పోల్ సర్వేలు ఎన్‌డీఏ, మహాఘట్‌బంధన్ మధ్య సమాన పోటీని సూచించాయి, అయితే మహాఘట్‌బంధన్‌కు స్వల్ప ఆధిక్యం (52%) ఎన్డీఏకు (38%) ఉందని ఒపీనియన్ పోల్స్ చెప్పాయి. కానీ సెప్టెంబర్ నుంచి పరిస్థితి మారింది. నీతీష్ కుమార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) వ్యవస్థ, ఓటర్ల మనసులను ఆకర్షించాయి. మహిళల ఖాతాల్లో ఆగస్టు–సెప్టెంబర్‌లో బదిలీలు సమయానికి చేయబడటం, యువతకు రూ.10 వేల సహాయ పథకం ప్రారంభం వంటివి ఈ మార్పుకు మూలం. నీతీష్‌కు రాష్ట్రవ్యాప్తంగా భావోద్వేగ సానుభూతి ఉండటం వల్ల, కూటమి మార్పులు జరిగినా ఆయన ప్రభావం కొనసాగుతోంది. ఇది ఎన్‌డీఏకు మొత్తం బలాన్ని పెంచుతూ, పోటీని ఒక్కసారిగా మలుపు తిప్పుతోంది.
ఎవరి ఓటు బ్యాంకు వారిదే..
బిహార్ ఎన్నికలు కుల ఆధారిత ఓటు బ్యాంకుల చుట్టూ తిరుగుతాయి. మహాఘట్‌బంధన్‌కు ముస్లిం సమాజం (17%), యాదవులు (14%) ప్రధాన మద్దతు. అయితే చదువుకున్న యువ యాదవులు స్వల్పంగా ఎన్‌డీఏ వైపు మొగ్గు చూపవచ్చు. ఎన్‌డీఏ వైపు అగ్రవర్ణాలు, ఓబీసీలు బలంగా ఉంటారు. దళితులు (20%)లో మూసహార్ కమ్యూనిటీ (5%)కు హిందుస్తాన్ అవామీ మోర్చా, ఆర్‌జేడీ, ఎల్‌జేపీ (ఇది రెండు భాగాలుగా విభజించబడి, ఒకటి కాంగ్రెస్‌తో, మరొకటి బీజేపీతో) మద్దతు ఉంది. చమార్ సమాజం మహాఘట్‌బంధన్‌కు సానుకూలం. ఈ స్పష్టమైన విభజనల మధ్య తటస్థ ఓటర్లు, చిన్న పార్టీల ప్రభావం కీలకం. జన్ సురాజ్ పార్టీ (ప్రశాంత్ కిశోర్) మద్దతు 10% నుంచి 6%కి తగ్గడం, ఎన్‌డీఏకు అనుకూలం. ఆప్ అన్ని స్థానాల్లో పోటీ ప్రకటించడం వల్ల ఓట్లు చీలే అవకాశం ఉంది. బీజేపీ వ్యతిరేక ఓట్లు విభజించబడితే, జేడీయూ–బీజేపీ కలిసి మెజారిటీ సాధించవచ్చు.
మోదీ రంగంలోకి వస్తే..
ఇక ఇప్పటి వరకు మోదీ రంగంలోకి దిగలేదు. ఆయన కూడా బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున నాలుగైదు సభలు నిర్వహించే అవకాశం ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం చాలా రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూలంగా మారింది. ఈ నేపథ్యంలో బిహార్ ఎన్నికల్లో కూడా అదే నినాదంతో ముందుకు సాగే అవకాశం ఉంది. ఇప్పటికే వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో మోదీ వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత మారుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో 67 స్థానాలు 3 వేల ఓట్ల మెజారిటీతోనే నిర్ణయించబడ్డాయి, ఇది ఈసారి కూడా హోరాహోరీ పోటీ సూచిస్తోంది. తటస్థ ఓటర్లు తగ్గుతున్న నేపథ్యంలో, పథకాలు, నాయకుల ఇమేజ్ ఫలితాలను ప్రభావితం చేస్తాయి. మొత్తంగా, ఎన్‌డీఏకు స్వల్ప ఆధిక్యం కనిపిస్తున్నా, మహాఘట్‌బంధన్ సరిహద్దు ప్రాంతాల్లో బలపడితే సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ ఎన్నికలు బిహార్ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని రాస్తాయని అంచనా.