Chandrababu: అంగళ్ల అల్లర్ల కేసులో చంద్రబాబుకు ఊరట దక్కింది. హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆగస్టు 8న అన్నమయ్య జిల్లా అంగళ్లలో చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అప్పట్లో పోలీసులపై టీడీపీ శ్రేణులు దాడికి దిగాయంటూ కేసులు నమోదయ్యాయి. 70 మంది టిడిపి నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. చాలామందిని అరెస్టు చేశారు. కొద్దిరోజుల పాటు వారు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అటు తరువాత బెయిల్ పొంది జైలు నుంచి బయటకు వచ్చారు. స్కిల్ స్కాం కేసు అనంతరం చంద్రబాబు ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం వెల్లడించింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ అదేశాలిచ్చింది. లక్ష రూపాయలు పూచికత్తు సమర్పించాలని సూచించింది.
రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు ప్రాజెక్టులను సందర్శించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆగస్టు 8న అంగళ్ల కూడలి వద్ద అల్లర్లు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే హింసాత్మక ఘటనలు జరిగాయంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబును ఏ 1 నిందితుడిగా చూపారు. మరో 70 మంది సైతం కేసులు నమోదు చేశారు. అందులో కొందరినీ అరెస్టు చేశారు. బెయిల్ పై విడుదలయ్యారు. మరికొందరు కీలక నాయకులు ముందస్తు బెయిల్ పొందగలిగారు. తాజాగా స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుపై పట్టు బిగిస్తున్న క్రమంలో.. అంగళ్ళ అల్లర్ల కేసును సైతం తెరపైకి తెచ్చారు. దీంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
హైకోర్టులో నిన్న సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదించారు. అధికార వైసీపీకి చెందిన వారే చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లు విసిరిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పట్లో వ్యక్తిగత భద్రతా సిబ్బంది చంద్రబాబుకు రక్షణగా నిలిచి కాపాడారని చెప్పుకొచ్చారు. ఇప్పటికే హైకోర్టులో నిందితులకు ముందస్తు బెయిల్ మంజూర అయిందని.. సుప్రీంకోర్టు సైతం సమర్ధించిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై ఏజీ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించినా ప్రయోజనం లేకపోయింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.