Job Mela: బెజవాడ అంటే ఒకప్పుడు రౌడీయిజానికి పెట్టింది పేరు.. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పేరు.. అక్కడి రౌడీలు ఏమాత్రం తగ్గలేదు. పోలీసుల కఠినచర్యలతో కాస్త జోరు తగ్గించారు. ఈ క్రమంలోనే బెజవాడలో రౌడీయిజాన్ని తగ్గించడానికి పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. దీనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. విజయవాడ పోలీసులు ఏం చేశారు? ఇప్పుడది దేశవ్యాప్తంగా ఎందుకు ప్రశంసలు అందుకుంటోందన్న దానిపై స్పెషల్ ఫోకస్..

నగరాల్లోని రౌడీషీటర్లను కట్టడిచేయడానికి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడాలు.. ఎన్ కౌంటర్ చేయడాలు చేస్తుంటారు. కానీ ఈ బెజవాడ పోలీసులు మాత్రం వినూత్నంగా ఆలోచించారు. రౌడీయిజం కారణంగా మంచి భవిష్యత్తును కోల్పోయిన వారికి సమాజంలో గౌరవంగా బతికే దారి చూపుతున్నారు.
రౌడీషీటర్ గా ముద్రపడితే వారికి ఎవరూ ఉద్యోగం ఇవ్వరు. కనీసం చేసుకోవడానికి పని కూడా ఇవ్వడానికి భయపడుతారు. దీంతో వాళ్లు మళ్లీ రౌడీయిజం వైపు వెళతారు. అందుకే రౌడీషీటర్ల కోసం జాబ్ మేళా నిర్వహించి అందరినీ సర్ ప్రైజ్ చేశారు విజయవాడ పోలీసులు.
విజయవాడ సీపీ కాంతిరాణా టాటా రౌడీషీటర్ల సమస్యలను తెలుసుకొని.. అర్థం చేసుకొని ఉపాధి కల్పించాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు వీళ్లకు ఉపాధి కల్పించడానికి చాలా మంది ముందుకు రావడం విశేషం. పాత జీవితాన్ని వదిలి సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలని రౌడీ షీటర్లకు సీపీ సూచించారు.
ఇక స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉపాధి కల్పించే చర్యలు చేపట్టామని.. 16 కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందు రావడం సంతోషంగా ఉందని పోలీసులు తెలిపారు.
తెలిసి తెలియక తప్పులు చేసి జైలు పాలైన రౌడీలకు పోలీసులు ఈ కొత్త దారి చూపిస్తున్నారు. సమాజంలో వారిని గౌరవంగా బతికేలా తీర్చిదిద్దుతున్నారు. పాత జీవితాన్ని వదిలి సరికొత్త జీవితాన్ని ప్రారంభించేలా చేస్తున్నారు. పోలీసుల ప్రయత్నాలకు ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు కురుస్తున్నాయి.