AP Cabinet Reshuffle: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించారు. ఉగాదికే కొత్త మంత్రివర్గం ప్రకటించాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల ఈనెల 11కు వాయిదా వేశారు. ఇక ఈ నెల 7న మంత్రివర్గం చేత రాజీనామాలు చేయించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులకు సంకేతాలు వెళ్లినట్లు సమాచారం. దీంతో వారు సైతం రాజీనామాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం సాగుతోంది.

మంత్రివర్గంలో తొంబైశాతం మందిని తొలగిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో చెప్పిన విధంగానే సమీకరణలు మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏడున అందరి చేత రాజీనామాలు చేయించి కొత్త వారిని తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు.
ప్రస్తుతం ఉన్న మంత్రులతో 7న కేబినెట్ భేటీ నిర్వహించి తరువాత రాజీనామాల విషయం ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే చివరి కేబినెట్ సమావేశం కానుంది. నూతనంగా మంత్రివర్గంలోకి తీసుకునే వారి పేర్లతో పాటు పదవుల నుంచి తొలగించే వారి జాబితా కూడా సిద్ధమైనట్లు సమాచారం. సమావేశం ముగిశాక మంత్రులందరు రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సామాజిక సమీకరణల నేపథ్యంల కొత్త మంత్రివర్గంపై జగన్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఎవరితో అయితే ప్రయోజనం దక్కుతుందనే దానిపై నిఘా పెట్టారు. 8న గవర్నర్ ను కలిసి రాజీనామాలు అందజేయనున్నారు. 11న కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్త వారికి 23 మందికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ ఏర్పాటుపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. మంత్రివర్గంలోకి సమర్థులనే తీసుకోనున్నట్లు చెబుతున్నారు.