గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చిత్తుగా ఓడిపోయారు. బైడెన్ ఘన విజయం సాధించారు. అమెరికన్లు పోల్చి చూసుకోవడమే ఈ ఫలితానికి కారణం. ట్రంప్ తో బైడెన్ ను పోల్చి చూసుకున్నారు. ట్రంప్ లో తెంపరి తనం, దుందుడుకు పోకడ ఎక్కువగా ఉన్నాయని.. సంయమనం, సమన్వయం బొత్తిగా లేవు అని నిర్ధారించుకున్నారు. బైడెన్ దగ్గరికి వచ్చేసరికి.. అనుభవం ఉన్నవాడని, అదే సమయంలో నిగ్రహం కలిగిన వాడని, ముందుచూపు ఎక్కువగా ఉన్నవాడని భావించారు. ఈ ఫలితంగానే ఎన్నికల్లో ఆ ఫలితం వచ్చింది. అయితే.. ఇప్పుడు ఆఫ్ఘన్ విషయంలో వ్యవహరించిన తీరు.. బైడెన్ సమర్థతను ప్రశ్నిస్తోంది. ప్రపంచంతోపాటు అమెరికన్ సమాజాం సైతం వేలెత్తి చూపిస్తోంది.
బైడెన్ గతంలోనూ ప్రభుత్వంలో పనిచేశారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. దేశ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అప్పుడు విదేశీ వ్యవహారాలను బైడెన్ చూసేవారు. ఇది కూడా గత ఎన్నికల్లో ఆయనకు కలిసి వచ్చింది. ట్రంప్ వ్యవహారశైలిపై విమర్శల జడి కురవడంతో.. అమెరికన్లంతా కలిసి బైడెన్ కు పట్టం కట్టారు. ట్రంప్ కారణంగా దిగజారిన ప్రతిష్టను బైడెన్ పెంచుతారని అనుకున్నారు. అయితే.. పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలో కొత్త అధ్యక్షుడు సరైన దారిలోనే ఉన్నట్టు కనిపించారు. కరోనా నియంత్రణలో బైడెన్ విజయం సాధించారు కూడా. తద్వారా.. ట్రంప్ కన్నా తాను బెటర్ అనిపించుకున్నారు. కానీ.. తాలిబన్ల విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయారని, బలగాల ఉపసంహరణ మొదలు.. ఏదీ ముందస్తు ఆలోచనతో, పక్కా ప్రణాళికతో చేయలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే.. వాస్తవానికి ఆఫ్ఘన్ నుంచి బలగాల తరలింపు ప్రక్రియ ఒప్పందం.. ట్రంప్ హయాంలోనే జరిగింది. అమలు మాత్రం బైడెన్ చేయాల్సి వచ్చింది. కానీ.. బైడెన్ దీన్ని సరిగా నిర్వర్తించలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో ట్రంప్ సైతం తీవ్ర విమర్శలు గుప్పించారు. చరిత్రలో ఏ యుద్ధానికీ ఇంతటి చెత్త ముగింపు లేదని అన్నారు. ఆఫ్ఘన్ నుంచి అమెరికా సేనలను, ప్రజలను, ఇతర అధికారులు, సిబ్బందిని తరలించడానికి ఒక ప్రణాళిక అన్నది లేకుండా పోయింది.
పై పెచ్చు.. వచ్చే ముందు కాబూల్ విమానాశ్రయంలో జరిగిన బాంబు పేలుడులో డజనుకు పైగా సైనికులను కోల్పోయింది అమెరికా. దీన్ని అమెరికా సమాజం జీర్ణించుకోలేకపోతోంది. తాలిబన్లు శరవేగంగా ఆఫ్ఘన్ ను ఆక్రమించుకోవడం అక్కడి పౌరులంతా ముందే ఊహించారు. బైడెన్ మాత్రం ఈ విషయాన్ని పసిగ్గట్టలేకపోయినట్టు చెప్పారు. అయితే.. దీనికి ఆఫ్ఘన్ సేనల వైఫల్యమేనని అమెరికా నిందించే ప్రయత్నం చేసింది. కానీ.. ఆఫ్ఘన్ సేనలు అంత బలమైనవైతే.. అమెరికా అక్కడకు ఎందుకు వెళ్లినట్టు అన్నది ప్రశ్న.
తీవ్రవాదాన్ని తుదముట్టిస్తామంటూ 20 ఏళ్ల ఆఫ్ఘన్ లో అడుగు పెట్టిన అమెరికా.. ఏం సాధించింది? అని అడిగితే సరైన సమాధానం కనిపించదు. కానీ.. కోల్పోయింది మాత్రం చాలా ఉంది. వేలాది మంది సైనికులను, మిలియన్ల కొద్దీ డాలర్లను, సమయాన్నీ కోల్పోయింది. కానీ.. తీవ్రవాదం అలాగే నిలబడింది. అక్కడి నుంచి నిష్క్రమించడం కూడా అవమానకర రీతిలోనే జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదంతా బైడెన్ అసమర్థత వల్లే జరిగిందని కూడా అంటున్నారు.