Bhuma Akhila Priya: ప్రస్తుతం భూముల ధరలకు రెక్కలు రావడంతో అమ్మిన వాటిని సైతం తమకు దక్కాలనే ఉద్దేశంతో న్యాయపోరాటం చేయడం చర్చనీయాంశం అవుతోంది. నగరంలో ఇటువంటి కేసులు కోకొల్లలు. గతంలోనే అమ్మిన భూమిపై తమకు హక్కుందని కోర్టు మెట్లెక్కడం నిజంగా దారుణం. ఎప్పుడో అవసరానికి అమ్ముకుని ఇప్పుడు ఆ స్థలంపై మాకు హక్కు ఉందని చెప్పడం నిజంగా హాస్యాస్పదమే. ఏవో అవసరాలకు విక్రయించి తీరా వారు ఇల్లు కట్టుకున్నాక ఆ స్థలంపై ఫైట్ చేయడం వారికే చెల్లుతుంది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా వారి ప్రవర్తన అనుమానాలకు తావిస్తోంది. చట్టపరంగా అమ్మిన స్థలం తమకు దక్కుతుందని ఆశపడటంలో అర్థం లేదు.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని మంచిరేవులో సర్వే నెంబర్ 190, 192/ఏ, 192/బీలలో భూమా నాగిరెడ్డి భార్య శోభా నాగిరెడ్డి పేర వెయ్యి గజాల స్థలం కొనుగోలు చేశారు. 2010లో ఆ స్థలాన్ని భూమా నాగిరెడ్డి రూ. 2 కోట్లకు విక్రయించాడు. అప్పుడు కూతుళ్లు అఖిల ప్రియ, మోనిక సంతకాలు చేయగా కొడుకు జగత్ విఖ్యాత్ రెడ్డి మైనర్ కావడంతో వేలిముద్ర వేశాడు. దీంతో ఆ స్థలంలో తనకు వాటా ఉందని జగత్ విఖ్యాత్ రెడ్డి అక్కలపై జిల్లా కోర్టు మెట్లెక్కడం వివాదాస్పదమవుతోంది. దీంతో కోర్టు సాక్ష్యాధారాలు అడగ్గా అందరు ఒకే ఇంట్లో ఉంటున్నట్లు రుజువు కావడంతో వీరి డ్రామాపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసి కేసు కొట్టేసింది.

దీంతో మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ స్థలం తన అక్కలది కాదని తనకు వాటా వస్తుందని ఆరోపిస్తూ కోర్టుకు చేరడం సంచలనం కలిగిస్తోంది. ఒకసారి అమ్మిన దానికి మళ్లీ ఆశపడటం ఏమిటని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీరివి అన్ని ఇలాంటి ఘాతుకాలే అని తెలుస్తోంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో వీరికి వ్యవసాయ భూమి ఉంది. దాన్ని కూడా విక్రయించగా దాన్ని కొనుగోలు చేసిన వారు బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేస్తే అది తనఖాలో ఉందని చెప్పడంతో లబోదిబోమంటున్నారు.
ప్లాట్లు కొనుగోలు చేసిన ఆరుగురిపై తోపాటు తన ఇద్దరు అక్కల మీద కూడా విఖ్యాత్ రెడ్డి కేసు వేయడం వివాదానికి తెర లేపుతోంది. ఇదో కొత్త నాటకంగా అభివర్ణిస్తున్నారు. కావాలనే స్థలం దక్కించుకోవాలనే దురుద్దేశంతో ఇలా కోర్టుల చుట్టు తిరగడం చూస్తుంటే వాటిని కొన్నవారికి ఆగ్రహం వస్తోంది. చట్టబద్ధంగా కొన్న వాటిపై కేసులు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి భూమా అఖిలప్రియ, మౌనిక, విఖ్యాత్ రెడ్డి వ్యూహాలేమిటో ఎవరికి అర్థం కావడం లేదు.