What Happen In Tollywood: స్టార్ హీరోలు తమకు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ తమ రెమ్యునరేషన్ ను కూడా పెంచుకుంటూ పోయారు. అది చూసి మేమేం తక్కువ, మాకు డిమాండ్ ఉంది కదా అంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా తమ రెమ్యునరేషన్ లను నోటికొచ్చినట్లు పెంచారు. దీనికితోడు దర్శకుల చేతగాని తనం కావొచ్చు, సినిమా మేనేజర్ల అవినీతి కావొచ్చు.. మొత్తమ్మీద నిర్మాణ వ్యయం అనేది అంత కంతకు పెరిగిపోతూ వచ్చింది. దీనిపై బడా నిర్మాతలంతా కూర్చుని నిర్మాణ వ్యయాన్ని తగ్గించి, ఇండస్ట్రీని ఓ కొలిక్కి తీసుకురావాలని ప్రస్తుతం చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఆగస్టు 1 నుంచి సినిమాల షూటింగ్ లను బంద్ చేస్తున్నారు. ఇది సంచలన నిర్ణయమే. పైగా ఈ నిర్ణయం తీసుకుంది టాలీవుడ్ యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్. ఈ గిల్డ్ లో ఉన్నవాళ్లే మెయిన్ ప్రొడ్యూసర్స్. స్టార్లతో సినిమాలు చేసేది కేవలం వీళ్ళే. అందుకే.. స్టార్ల పై ఒకరకంగా యుద్ధానికి దిగిన ఈ ప్రొడ్యూసర్స్ అందరూ ఒక మాట పై ఎంతవరకు నిలబడతారు ? అన్నదే ఇక్కడ మిలియన్ల డాలర్ల ప్రశ్న.
మరోపక్క ఈ గిల్డ్ సభ్యులు నిర్ణయాన్ని తెలుగు సినిమా నిర్మాతల మండలి ససేమిరా అంటోంది. ఇండస్ట్రీకి బంద్ ఏమిటి ?, సినీ కార్మికులు ఎలా బతకాలి ?, మీ సినిమాలకు బంద్ పాటించడం అనేది మీ వ్యక్తి గత వ్యవహారం.. దాన్ని ఇండస్ట్రీతో ముడి పెట్టొద్దు అంటూ మెజారిటీ ప్రొడ్యూసర్స్ బంద్ కి వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మాత సి. కల్యాణ్ సీరియస్ అవుతూ.. ‘గిల్డ్ అంతా డొల్ల. మా సినిమా ఇండస్ట్రీకి కావాల్సింది షూటింగ్ లే, అసలు ఇండస్ట్రీ మనుగడ సాగిస్తోంది అంటేనే చిన్న నిర్మాతల వల్ల. అలాంటిది వారికి ఇష్టం లేకుండా ఎలా బంద్ చేస్తారు ? అంటూ సి కళ్యాణ్ గిల్డ్ పై డైరెక్ట్ విమర్శలు చేశారు.
మరోపక్క గిల్డ్ లోని కొందరు నిర్మాతలే మళ్లీ వెనక్కి తగ్గుతున్నారు. బంద్ కి సపోర్ట్ చేస్తే తమ హీరోలకు ఎక్కడ కోపం వస్తోందో అని వారంతా భయపడుతున్నారు. అందుకే ఇప్పుడు బంద్ పెట్టాలా ? వద్దా ?, గిల్డ్ లోని మిగిలిన నిర్మాతలు ముందున్న అతి పెద్ద సవాల్. ఈ గిల్డ్ లో డి. సురేష్ బాబు, ఏషియన్ థియేటర్స్ అధినేత సునీల్ నారంగ్, దిల్ రాజు, అల్లు అరవింద్ వంటి బడా నిర్మాతలు ముఖ్యలుగా ఉన్నారు. వీరిలో కూడా ఒకరు ఇద్దరికి బంద్ ఇష్టం లేదని టాక్ ఉంది. అసలు గిల్డ్ లోని మెయిన్ సభ్యుల్లోనే సఖ్యత లేకుండా ఎలా మిగిలిన అందరూ ఒక మాట మీద నిలబడతారు ?

మరోపక్క పెద్ద నిర్మాత సి. అశ్వనీదత్ కూడా గిల్డ్ నిర్ణయం అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ‘అసలు షూటింగ్ లు బంద్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ?’ అంటూ నిప్పులు చెరిగారు. మొత్తానికి ఇండస్ట్రీలో ఇప్పుడు అయోమయ పరిస్థితి నెలకొంది. ఇటు చూస్తే దిల్ రాజు లాంటి కొందరు నిర్మాతలు గోడ మీద పిల్లి లాగా ఎవరు బలంగా మాట్లాడితే.. వాళ్ళ వైపు మాట్లాడుతున్నారు. అసలు ముఖ్య నిర్మాతల్లోనే ఏ మాత్రం స్థిరత్వం లేకుండా ఇండస్ట్రీని ఎలా రూల్ చేయగలరు ?, ఇప్పటికే బండ్ల గణేష్ కూడా గిల్డ్ వ్యవహరంపై ఘాటుగా విమర్శలు చేశాడు.
మొత్తానికి బంద్ విషయంలో ఎవరికి తోచింది వారు కౌంటర్ లు వేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే.. టాలీవుడ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ?, ఎవరు ఎవరి వైపు ఉంటారో కూడా చెప్పడం కష్టంగా మారింది. ఏది ఏమైనా షూటింగ్ ల బంద్ అనే అంశం ప్రొడ్యూసర్ల మధ్య చిచ్చు రగిలించేలా ఉంది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.