Bhartiya Janata Party : బిజెపి( Bhartiya Janata Party) రాజకీయపరంగా అతీతమైన శక్తిగా మారుతోంది. దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. సొంతంగా అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. కుదరని చోట బలమైన ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపి అధికారంలోకి రాగలుగుతోంది. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రభావం చూపిన బిజెపి.. దక్షిణాది విషయానికి వచ్చేసరికి మాత్రం తడబడుతోంది. ఒక్క కర్ణాటకలో మాత్రమే పూర్తిస్థాయిలో ప్రభావం చూపుతోంది. అందుకే ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని మాస్టర్ ప్లాన్ వేస్తోంది. ఇద్దరు దక్షిణాది హీరోలతో రాజకీయ మనుగడ సుస్థిరత చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో పొలిటికల్ మల్టీ స్టార్ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Also Read : జనసేనలోకి ఆ నేత.. పవన్ సంచలనం!
* దక్షిణాది రాష్ట్రాలు చిక్కలే..
2014లో నరేంద్ర మోడీ ( Narendra Modi) నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. 2019లో అయితే రెండోసారి బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. 2024 ఎన్నికల్లో సైతం మిత్రుల సహకారంతో హ్యాట్రిక్ కొట్టింది. అయితే గత 11 సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి దక్షిణాది రాష్ట్రాలు మాత్రం చిక్కడం లేదు. ఒక్క కర్ణాటక మినహాయిస్తే తమిళనాడు, కేరళ, ఏపీలో ప్రభావం అంతంత మాత్రమే. తెలంగాణలో మాత్రం బలం పెంచుకుంటూ వస్తోంది. ఏపీలో టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడంతో అధికారంలోకి రాగలిగింది. ఓట్లతోపాటు సీట్ల పరంగా మెరుగైన స్థానాలను సాధించింది.
* విజయ్ తో పొత్తు కోసం..
అయితే తమిళనాడులో( Tamil Nadu ) మాత్రం బిజెపికి కనీస స్థాయిలో కూడా ఓటు శాతం పెరగడం లేదు. సీట్లు కూడా దక్కడం లేదు. ఇటువంటి తరుణంలో తమిళ హీరో విజయ్ టీవీ కె పార్టీతో ముందుకు వచ్చారు. అధికార డీఎంకేని ఓడించి తీరుతానని చెబుతున్నారు. సొంతంగానే పోటీకి ముందుకు వస్తున్నారు. మరోవైపు అన్నాడీఎంకే పార్టీ బలంగా ఉంది. కానీ సొంతంగా అధికారంలోకి వచ్చేందుకు అవసరం అయిన నాయకత్వం అక్కడ లేదు. అందుకే బిజెపి మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఏపీ మాదిరిగా కూటమి కట్టి డీఎంకే కు డీ కొట్టాలని బలమైన వ్యూహంతో ఉంది. కానీ విజయ్ నుంచి మాత్రం సానుకూలత రావడం లేదు. అయితే ఎన్నికలకు సమయం ఉండడంతో విజయ్ నుంచి సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
* ఇప్పటికే రంగంలోకి పవన్..
ఇప్పటికే పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan)బిజెపి కోసం రంగంలోకి దిగారు. సనాతన ధర్మ పరిరక్షణకు బలమైన వ్యవస్థ అవసరమని భావిస్తున్నారు. తద్వారా బిజెపి హిందుత్వ అజెండాను బలంగా వినిపిస్తున్నారు. అయితే పవన్ వెనుక బిజెపి ఉందన్న అనుమానంతో తమిళనాడులో ఆయనపై అనేక రకాల విమర్శలు చేస్తున్నారు అక్కడ నేతలు. అదే సమయంలో తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ పెట్టారు పవన్. ఒక్క తమిళనాడు కాదు.. దక్షిణాది రాష్ట్రాల్లో తరచూ పర్యటనలు చేస్తున్నారు. ఆలయాలను సందర్శిస్తున్నారు. అయితే అటు విజయ్.. ఇటు పవన్ కళ్యాణ్ తో మల్టీ స్టార్ పాలిటిక్స్ చేయాలని బిజెపి భావిస్తోంది. ఆ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
Also Read : పవన్ పై లోకేష్ సంచలన కామెంట్స్.. వైసీపీకి కావాల్సింది అదేనా!