తెలుగు చిత్ర రంగంలో ఓ వెలుగు వెలిగిన మహనీయుడు ఎన్టీఆర్. ఆయనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఇప్పటిది కాదు. ఏనాటి నుంచో ఈ ప్రస్తావన వస్తోంది. కానీ ఇంతవరకు ఆయనకు భారతరత్న అందలేదు. చలనచిత్ర రంగం, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు. అయినా ఆయనకు భారతరత్న అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఆయన జయంతికి ప్రతిసారి గుర్తొచ్చే భారతరత్నను ఈసారి కూడా గుర్తుకు చేసుకున్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా చేయడానికి కుటుంబ సభ్యులే మోకాలడ్డుతున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఒకవేళ ఆయనకు భారతరత్న ప్రకటిస్తే ఆయన సతీమణి లక్ష్మీపార్వతి అందుకుంటుందనే సాకుతో భారతరత్న రాకుండా అడ్డుకుంటున్నారని సమాచారం. పైకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా లోలోపల వద్దనే విషయం చెబుతూ చక్రం తిప్పుతున్నారనే విషయం తెలుస్తోంది.
మోదీ సర్కారు పాలనలో టీడీపీ కూడా పాలు పంచుకుంది. దీంతో ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించడంలో ఎందుకు తాత్సారం చేశారనే ప్రశ్న ఉదయిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కు బారతరత్న ఇప్పించుకోవడంలో నేతలు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో వారికే తెలియాల్సి ఉంది.
తాజాగా మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని కోరుతున్నారు. మొన్నటివరకు మోదీ కేబినె ట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అశోకగజపతి రాజు ఎందుకు కృషి చేయలేదో తెలియాలి. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ సేవల్ని ప్రశంసించే వారే. అత్యున్నత పురస్కారం ఎందుకు దక్కలేదన్నదే మిస్టరీగా మారింది.