Bengaluru Water Crisis: మిగతా రోజుల్లో ఎలా ఉన్నా.. ఎండాకాలంలో నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఎండ వేడిమి వల్ల ఉదయం, సాయంత్రం స్నానం చేయాల్సి వస్తుంది. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మండిపడుతున్నాయి. 40 కి మించి డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ప్రజలకు చుక్కలు కనపడుతున్నాయి. అయితే గత ఏడాది సరైన స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. ముఖ్యంగా దక్షిణాది లో ప్రముఖ రాష్ట్రమైన కర్ణాటలో తాగునీటి డిమాండ్ తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా బెంగళూరు ప్రాంతంలో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపు దాల్చింది.
తాగునీటి కరువు సామాన్యులకు మాత్రమే కాదు శ్రీమంతులకు కూడా చుక్కలు చూపిస్తోంది. కోట్లు పెట్టి కొనుగోలు చేసి అపార్ట్మెంట్స్, విల్లాల్లో ఉంటున్నవారు సైతం నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. అవసరాలకు తగ్గట్టుగా నీరు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.. బెంగళూరు ప్రాంతంలో తాగునీటి ఎద్దడికి సంబంధించి రోజుకో తీరుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. చేతులు కడుక్కునేందుకు నీళ్లు లేకపోవడంతో అక్కడి ప్రజలు టిష్యూలు వాడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి జలాశయాలలో నీళ్లు మరింత లోతుకు పడిపోతున్నాయి. దీంతో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా బెంగళూరు ప్రాంతంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో చాలామంది ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. ఇక సంపన్నులు కూడా నీటి ఎద్దడి వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నీటి కోసం రోడ్లెక్కుతున్నారు.
ఇటీవల బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి బోర్డు రోజుకు 40 లక్షల నుంచి రెండు కోట్ల లీటర్ల మధ్య నీటిని వినియోగిస్తున్న రెసిడెన్షియల్ కాలనీలకు, సొసైటీలకు 10 శాతం కోత విధించింది. దీంతో వారికి తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. బెంగళూరులోని షాపూర్జీ పల్లోంజీ వెస్ట్ పార్క్ లో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో అక్కడి ప్రజలు తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.. ఈ ప్రాంతంలో శ్రీమంతులు అధికంగా ఉంటారు. వారు నివసించే ఒక్కో ఫ్లాట్ ఖరీదు దాదాపు రెండు కోట్ల వరకు ఉంటుంది. అన్ని కోట్లు ఖర్చుపెట్టి ప్లాట్ కొంటే.. ఈ నీటి కష్టాలు ఏంటి అంటూ బిల్డర్లకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు..”అప్పట్లో మా చేతి నుంచి కోట్లు కట్టించుకున్నారు.. ఇప్పుడేమో చుక్క నీళ్లు కూడా లేవు. మాకు అర్జెంటుగా నీరు సరఫరా చేయాలి” అంటూ బిల్డర్లకు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు. అయితే సాధ్యమైనంత వరకు నీటి సమస్యను పరిష్కరిస్తామని షాపూర్జీ పల్లోంజీ రియల్ ఎస్టేట్ యాజమాన్యం ప్రకటించింది. వారిచేత నిరసనను విరమింపజేసింది.. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి.
Water Crisis in Bengaluru
Imagine Paying 1 Crore for Residential Apartments and Needing to Protest for Water? pic.twitter.com/gOiMlHmpDL
— Ravisutanjani (@Ravisutanjani) April 8, 2024