
ముంబై మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం గురించి తెలుసు.. దుబాయ్ కేంద్రంగా అతడు దేశంలో ఎన్ని మారణహోమాలు చేశాడో తెలుసు. కానీ మంచి కోసం మాఫియా డాన్ గా మారి.. జనాలను దోచుకుంటున్న వారిని చంపి రియల్ హీరోగా బెంగళూరు గాడ్ ఫాదర్ గా నిలిచిన ఓ అండర్ వరల్డ్ డాన్ ఉన్నాడని మీకు తెలుసా? వందల కోట్లకు ఆసామీ అయిన ఇతడు ఎంతో మంది పేదలకు, ప్రజలకు సేవ చేశాడు. ఒక బ్యాంకు ఉద్యోగి నుంచి అండర్ వరల్డ్ డాన్ గా.. గాడ్ ఫాదర్ ఆఫ్ బెంగళూరుగా 30 ఏళ్లు ఎలా ఎలాడన్న దానిపై జాతీయ మీడియాలో కథలు కథలుగా వస్తున్నాయి.
ముతప్ప రాయ్.. ఒకప్పుడు మాఫియాను ఏలిన డాన్. ఆ తర్వాత సోషల్ యాక్టివిస్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే కాల్పులకు గురయ్యాడు. బుల్లెట్లకు ఎదురునిలిచి బతికి బయటపడ్డాడు. మాఫియా డాన్ ముతప్పరాయ్ 68 ఏళ్ల వయసులో మాత్రం బ్రెయిన్ క్యాన్సర్ ను ఎదురించలేక కన్నుమూశాడు. గురువారం చనిపోయిన మాజీ అండర్ వరల్డ్ డాన్ ముతప్ప రాయ్ ఒకప్పుడు సాధారణ బ్యాంకు ఉద్యోగి. ఆ తర్వాత నేరస్రామాజ్యానికి నాయకుడిగా ఎదిగారు.. ఈ అండర్ వరల్డ్ డాన్ ప్రయాణం గురించి తెలుసుకుందాం..
*జయ కర్ణాటక ఆర్గనైజేషన్ తో పేదలకు సేవ
మాఫియా డాన్ ముతప్ప శత్రువల విషయంలో ఎంత క్రూరత్వం ప్రదర్శించినా పేదల వరకు వచ్చేసరికి వారికి అన్నగా మారాడు. ఆదుకున్నాడు. ఎంత సంపాదించినా సేవ కోసం ఖర్చు చేశాడు. బెంగలూరులో ‘జయ కర్ణాటక ’ ఆర్గనైజేషన్ స్థాపించి పేద ప్రజలకు సహాయం చేశాడు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏకంగా ముతప్పరాయ్ జీవిత కథ ఆధారంగా కన్నడలో ‘వివేక్ ఓబెరాయ్’ హీరోగా ‘రాయ్’ సినిమాను కూడా తెరకెక్కించాడు. అతడు మాఫియా డాన్ కంటే కూడా ప్రజల మదిలో హీరోగా వెలిగిపోయాడు. ఇలా చాలా ఏళ్లు బెంగళూరు అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని ఏలిన ముతప్ప చివరకు తాజాగా కన్నుమూశాడు.
* ముతప్పపై రెండు సార్లు హత్యాయత్నం
ముతప్ప రాయ్ కి 5 బుల్లెట్లు దిగాయి. కానీ ప్రాణాలతో బతికి బట్టకట్టాడు. బెంగళూరు అండర్ వరల్డ్ డాన్ గా మారిన ముతప్పరాయ్ పై రెండు సార్లు హత్యాయత్నం జరిగింది. బెంగళూరు కోర్టుకు ఓ కేసు విషయమై హాజరు కాగా.. ప్రత్యర్థులు ఆయనపై బుల్లెట్ల వర్షం కురిపించారు.
*బ్యాంకు ఉద్యోగి నుంచి బెంగళూరు అండర్ వరల్డ్ డాన్ గా..
ముతప్పరాయ్.. అందగాడు.. కామర్స్ గ్రాడ్యుయేట్. విద్యావంతుడు.. కష్టపడి చదివి విజయా బ్యాంకులో ఉద్యోగిగా తన కెరీర్ మొదలుపెట్టాడు. బెంగళూరులో అగ్ర కులాల్లో ఒకటైన బంత్ కమ్యూనిటీకి చెందినవాడు. అయితే 1980లో బెంగళూరు అండర్ వరల్డ్ తో ముతప్పకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 1990లో అప్పటి గ్యాంగ్ స్టర్, పొటిటీషియన్, ఎంపీ జైరాజ్ ను పట్టపగలే ముతప్పరాయ్ హత్య చేయడం పెద్ద సంచలనమైంది. ఈ హత్యతో బెంగళూరు మాఫియా సామ్రాజ్యానికి బాస్ గా ముతప్ప రాయ్ ఎదిగారు. ఆ తర్వాత 1991లో బెంగళూరులో పెరిగిన రియల్ భూమ్ తో ముతప్ప పట్టుబిగించాడు.
*ముంబై మాఫియా డాన్ దావుద్ తో పరిచయం
1990లోనే ముతప్పరాయ్ కి ముంబై మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ తో పరిచయం ఏర్పడింది. 1996లో దుబాయ్ కి పారిపోయి ముతప్ప దావుద్ గ్యాంగ్ తో వద్ద తలదాచుకున్నాడు. 2000 సంవత్సరంలో దుబాయ్ ప్రభుత్వం ముతప్పను భారత్ కు అప్పగించింది. కొన్ని నెలలు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఆరోపణలపై నిర్ధోషిగా బయటకొచ్చాడు. బెంగళూరు శివారుకు మకాం మార్చి అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఆ తర్వాత ప్రజలకు సేవ చేసేందుకు ట్రస్ట్ పెట్టి తన ఆస్తినంతా ప్రజలకు కోసం కష్టపడి రియల్ హీరో అనిపించుకున్నాడు.
-నరేశ్ ఎన్నం