పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీకి, బెంగాల్ లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇన్నాళ్లు దాడుల వరకే సాగిన వీరి వైరం తాజాగా కాల్పుల వరకు వెళ్లింది.
కేంద్ర హోంమంత్రి మోహరించిన కేంద్ర బలగాల చేతుల్లో తాజాగా నలుగురు మరణించడంతో బెంగాల్ ఉద్రిక్తంగా మారింది. ఈ పాపం కేంద్ర హోంమంత్రి అమిత్ షాది అని మమతా బెనర్జీ ఆరోపించారు. కాల్పులు జరిపిన చోట వెళ్లి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపనున్నట్లు ఆమె ప్రకటించి మరింత హీట్ పెంచారు.
– అసలేం జరిగిందంటే?
పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం 4వ దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మొత్తం 44 అసెంబ్లీ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 373మంది బరిలో ఉన్నారు. ప్రధానంగా బీజేపీ, టీఎంసీ పోటీలో ఉన్నాయి.
ఈ క్రమంలోనే కోచ్ బిహార్ జిల్లాలో తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు ఇక్కడ జరిగిన ఓ గొడవలో యువ ఓటు మరణించారు.
కోచ్ బిహార్ లోని సీతల్ కుచిలో గల ఓ పోలింగ్ కేంద్రం ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆనంద్ బుర్మాన్ అనే యువ ఓటరుపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ హత్యపై బీజేపీ, టీఎంసీలు పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. ఘటన వెనుక కాషాయ పార్టీ హస్తం ఉందని టీఎంసీ ఆరోపించింది. మృతుడు తమ పోలింగ్ ఏజెంట్ అని.. అధికార టీఎంసీ నేతలే అతడిపై కాల్పులు జరిపారని బీజేపీ ఆరోపించింది. ఈ కాల్పుల నేపథ్యంలోనే అక్కడ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. బాంబులు విసురుకున్నారు. దీంతో కేంద్ర బలగాలు అక్కడి చేరుకొని ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. పరిస్థితి సద్దుమణగకపోవడం.. బలగాలపైకి నిరసన కారులు రావడంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. దీంతో కేంద్ర బలగాల కాల్పుల్లో నలుగురు చనిపోయారని టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. అక్కడి వెళ్లి నిరసన తెలిపేందుకు రెడీ కావడంతో బెంగాల్ అట్టుడుకుతోంది.