వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సామాజికవర్గాల మధ్య విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నించారని, ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా అభాసుపాలు చేసేందుకు కుట్ర చేశారని ఆయనపై కేసు నమోదుచేసిన సీఐడీ.. అదుపులోకి తీసుకుంది.
అయితే.. ఈ అరెస్టుకు ముందే రఘురామ హైకోర్టుకు వెళ్లారు. అయితే.. తన అరెస్టు విషయమై కాదు. బెయిల్ విషయమై కూడా కాదు. ఏపీ డెయిరీని అమూల్ సంస్థకు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దాన్ని అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించారు.
సర్కారు ఆస్తులు అమూల్ సంస్థకు బదలాయించాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో పారదర్శకత లేదని, టెండర్లు పిలవకుండా ఒక ఏజెన్సీని ఎంపిక చేయడం, వందల కోట్లను లీజుకు ఇవ్వడం ఉద్దేశపూర్వకంగా లబ్ధి చేకూర్చడమేనని పిటిషన్లో రఘురామ పేర్కొన్నట్టు సమాచారం.
ఒకవేళ డెయిరీ ఆస్తులను లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తే.. పబ్లిక్ ఏజెన్సీ అయిన నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డుకు ఇవ్వొచ్చని పేర్కొన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ మౌలిక సదుపాయాలు, ఖర్చులతో పాలను సేకరించి, మార్కెటింగ్ చేసేందుకు అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం చట్ట విరుద్ధమని కోర్టుకు తెలిపినట్టు సమాచారం.
అంతేకాకుండా.. లీజు విధివిధానాలు కూడా బయటకు వెల్లడించలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారట. వాస్తవానికి ప్రభుత్వ ఆస్తులను ఎవరికైనా లీజుకు ఇవ్వాలంటే ముందుగా టెండర్లు పిలుస్తారు. అందులో ఎక్కువ కోట్ చేసిన వారికి కేటాయిస్తారు. దీనికి విరుద్ధంగా అమూల్ తో ఒప్పందం జరిగిందని కోర్టును ఆశ్రయించిన రోజునే.. రఘురామకృష్ణ రాజును అరెస్టు చేయడం గమనార్హం. ఈ కేసుపై సోమవారం విచారణ జరగనుంది. మరి, న్యాయస్థానం ఎలాంటి తీర్పు చెబుతుందోనని ఉత్కంఠగా మారింది.