
దేశంలో లాక్డౌన్ ను కొనసాగిస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే లాక్డౌన్ 4.0లో క్రీడలకు కొన్ని మినహాయింపులను ఇచ్చింది. ప్రేక్షకులు లేకుండా క్రీడా వేదికలు, మైదానాలు తెరిచేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినప్పటికీ బీసీసీ ఐపీఎల్ టోర్నిని వాయిదా వేసేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. మే 31వరకు ఉన్న లాక్డౌన్లో భాగంగా దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై కేంద్రం నిషేధం విధించింది. దీంతో ప్రయాణాలు లేకుండా ఐపీఎల్ నిర్వహించడం కష్టసాధ్యమని టోర్నీ నిర్వాహాకులు అభిప్రాయం వెలిబుచ్చుతోన్నారు.
లాక్డౌన్ 4.0లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలను అధ్యాయనం చేయనుంది. ఈమేరకు వాటిని పరిశీలించి ఐపీఎల్ టోర్ని నిర్వహాణ సాధ్యసాధ్యాలపై త్వరలోనే బీసీసీఐ ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది. అలాగే ప్రేక్షకులు లేకుండా టోర్ని నిర్వహించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆటగాళ్లు స్టేడియాల్లో ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం దొరికింది. ఆటగాళ్లంతా వివిధ ప్రాంతాలకు చెందినవాళ్లు కావడంతో వారంతా ఒకేచోట ప్రాక్టీస్ చేయడం సాధ్యకాకపోవచ్చు. ఆటగాళ్లు తమకు అందుబాటులో ఉన్న స్టేడియాల్లో ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంది. అయితే ఐపీఎల్ నిర్వహాణపై ఆగస్టులో చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు బీసీసీఐ ఐపీఎల్ నిర్వహణపై త్వరలో ఓ ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.